వాహన చోదకులు ఫోన్ మాట్లాడుతూ... వాహనాలు ఎందుకు నడుపుతున్నారో తెలుసుకునేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మొన్నటి ఏప్రిల్, మే నెలల్లో సర్వే నిర్వహించారు. రోజుకు సగటున 500 మంది చొప్పున ప్రశ్నించారు. వీరిలో 90 శాతం మంది పోలీసులు పట్టుకోరన్న భావనతోనే అలా నడుపుతున్నామని తెలిపారు. ద్విచక్రవాహనాలపై వెళ్తున్న విద్యార్థులు, యువకులు, మహిళలను ప్రశ్నిస్తే వాహనం నడిపేటప్పుడు ఒత్తిడి, కంగారును అధిగమించేందుకు పాటలు వింటున్నామన్నారు. శిరస్త్రాణంలో ఫోన్ ఉంచుకుని వెళ్తున్నవారిని ప్రశ్నిస్తే అత్యవసరమైన ఫోన్లు వస్తే మాట్లాడుతున్నామని చెప్పారు. ఇటువంటివారందరికీ చలానాలు జారీ చేస్తున్నారు. ఒక్క మే నెలలోనే 1,131 కేసులు నమోదు చేశారు.
అవగాహన కల్పిస్తూ..
సెల్‌ఫోన్ డ్రైవింగ్ నేరమంటూ కూడళ్ల వద్ద మైకుల ద్వారా పోలీసులు ప్రచారం చేస్తున్నారు. స్వచ్ఛంద సేవాసంస్థల సహకారం తీసుకోవడమే గాక పట్టుబడిన వాహనచోదకులనూ రప్పించనున్నారు. వచ్చే నెల తొలి వారం నుంచి షాపింగ్‌మాల్స్, బహుళ అంతస్తుల భవనాల వద్ద సూచికలను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.
పరిసరాలను గమనించకుండా..
- వాహనాలు నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడడం చాలా ప్రమాదకరం. కొందరు ఫోన్ రాగానే ముందూవెనుక చూసుకోకుండా మాట్లాడుతున్నారు. మరికొందరు హలో.. అంటూ వాహనాన్ని టక్కున ఆపేస్తున్నారు. దీంతో వెనుక ఉన్న వాహనాలు వీరిని ఢీకొంటున్నాయి.
- ఈ ఏడాది తొలి 3 నెలల్లో హైద్రాబాద్ లోని సైఫాబాద్, అబిడ్స్, మలక్‌పేట, టోలీచౌకీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్సార్‌నగర్, పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్‌ఠాణాల పరిధిలో జరిగిన ప్రమాదాల్లో సెల్‌ఫోన్ డ్రైవింగ్‌వే ఎక్కువ.
- ప్రధాన ప్రాంతాల్లో ద్విచక్ర వాహనచోదకుల్లో 60 శాతం, కార్ల డ్రైవర్లు 40శాతం మంది ఫోన్ మాట్లాడుతూ నడుపుతున్నారని గుర్తించారు.
ఇవీ చూడండి: అంబులెన్స్‌లో తరలిస్తున్న మద్యం పట్టివేత