అసలే కరోనా సెలవులు.. జూన్ వరకు పిల్లలు ఇంట్లోనే గడపాలి. కనీసం ట్యూషన్ పంపిచే అవకాశం కూడా లేదు. అందుకే.. ఈ పరిస్థితికి తగ్గట్టు తల్లిదండ్రులు స్మార్ట్ గా వ్యవహరిస్తున్నారు. పిల్లలకు సృజనాత్మక, ఆలోచనాత్మక, నైపుణ్య శక్తిని ప్రేరేపించే అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు.
వీడియో గేమ్స్ లాంటి వాటికి పిల్లల్ని దూరం పెడుతూ.. బిల్డింగ్, చెస్, క్యారమ్స్ ఆటలతో పాటు కంప్యూటర్ వాడకంలో మెళకువలను ఒంటబట్టేలా చేస్తూ అనుబంధం పెంచుకుంటున్నారు. మరోవైపు పదో తరగతి విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధనకు ఉపాధ్యాయులు ఆన్‌లైన్, వాట్సాప్‌ల ద్వారా పంపుతున్న పాఠాలను వల్లెవేస్తున్నారు. పరీక్షలకు సిద్ధమవుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
ట్యాబుల్లో పాఠాలు.. ఆటవిడుపునకు క్యారమ్స్
"మాది సత్తెనపల్లి. రఘరాం నగర్‌లో ఉంటున్నాం. స్థానిక కేంద్రియ విద్యాలయలో ఐదు, మూడో తరగతి చదువుతున్నాం. కరోనా సెలవులు రావడంతో మా నాన్న పిచ్చయ్య సాయంతో ట్యాబ్ ద్వారా కొత్త పాఠ్యాంశాలు నేర్చుకుంటున్నాం. ఇప్పటి వరకు చదివిన పాఠాలను పునశ్చరణ చేసుకుంటున్నాం. కొంత సమయం ఆటలకు కేటాయిస్తున్నారు. క్యారమ్స్‌లో మెలకువలు తెలుసుకుంటున్నాం." - పార్థసారథి, మహీధర్, విద్యార్థులు, సత్తెనపల్లి
ఇండోర్ గేమ్స్.. దినపత్రికలు చదువుతూ
"మాది కంచికచర్ల. నేను తొమ్మిది, చెల్లెలు ఏడో తరగతి చదువుతోంది. కరోనా సెలవులతో కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాం. అమ్మానాన్నలు బయటకు పంపకుండా చెస్, క్యారమ్స్, పద వినోదం వంటి ఆటలు నేర్పిస్తున్నారు. దీనివల్ల వినోదంతో పాటు విజ్ఞానం అందుతోంది. కొద్దిసేపు ఈనాడు దినపత్రిక చదవుతూ తెలుగు భాషపై పట్టు పెంచుకుంటున్నాం.ఎట్టి పరిస్థితిలో బయటకు వెళ్లడం లేదు." - సంతోష్, దీనాజాస్మిన్
ఆటలు.. ఇంటి శుభ్రతకు ప్రాధాన్యం
కరోనా సెలవుల నేపథ్యంలో ఇంటి పట్టున ఉంటున్న 5 నుంచి 8 ఏళ్ల చిన్నారుల మారాన్ని తల్లిదండ్రులు ఆటల రూపంలో నియంత్రణలో ఉంచుతున్నారు. అ, ఆ లు కూడా నేర్పిస్తున్నారు. తర్వాత ఇంటి శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నీటిలో డెటాల్ కలిపిన ద్రావణంతో ఫ్లోరింగ్, స్విచ్ బోర్డులు తుడుస్తూ, బయట నుంచి తెచ్చిన కూరగాయలు, పాల ప్యాకెట్లను కడుగుతున్నారు. తరచూ ఇంటి, వీధి తలుపులకు పిచికారీ చేస్తున్నారు.
చదరంగమే మా కాలక్షేపం
"మాకు చదరంగం నేర్చుకోవాలనే ఆసక్తి మెండుగా ఉంది. పాఠశాల రోజుల్లో క్షణం తీరిక ఉండేది కాదు. ఉన్నా చదరంగం బల్ల తీస్తే పెద్దవాళ్లు ఊరుకోరు. దాంతో ఆటపై పట్టు సాధించలేకపోయేవాళ్లం. అనుకోకుండా వచ్చిన ఈ సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మమ్మల్ని ప్రోత్సాహం ఇస్తున్నారు. ఈ ఆట ముందు కూర్చుంటే ఇక బయటకు వెళ్లాలనిపించదు. దీనివలన మెదడుకు చురుకుదనం, ఏకాగ్రత పెరుగుతుంది." - డి.జస్మిత, భట్టిప్రోలు
నూరుశాతం ఉత్తీర్ణతకు సాధన ఇలా
"వాట్సాప్ ద్వారా మా అధ్యాపకులు, తోటి విద్యార్థినులు అందించిన పాఠ్యాంశ వివరాలను రాసుకొని చదువుకుంటున్నాం. మా సందేహాలను వాట్సాప్ ద్వారా అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్తున్నాం. కొత్త విషయాలు నేర్చుకునేందుకు మాకో మంచి అవకాశం." - కిరణ్మయి, వీరంకిలాకు
ఇదీ చూడండి: