అధిక ఫీజులు వసూలు చేయవద్దని హెచ్చరించినా... పట్టించుకోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలపై చర్యలు తప్పవని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు హెచ్చరించారు. విద్యార్థుల ఫీజు, ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయంలో కమిషన్‌తో పాటు ప్రభుత్వం సైతం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని.. అయినా ఈ అంశాలపై ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన చెప్పారు. కొవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించిన కొన్ని విద్యాసంస్థలు అధిక ఫీజు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆన్లైన్ క్లాసులకు అనుమతి ఇచ్చినంత మాత్రాన ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు వసూలు చేసుకోవాలని చెప్పినట్లు కాదని స్పష్టం చేశారు.
ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు గత సంవత్సరం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకోవాలని అది కూడా వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇవ్వాలని జస్టిస్. కాంతారావు స్పష్టం చేశారు. అదనంగా ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని హెచ్చరించారు. కరోనా సాకు చూపి మార్చి నెల నుంచి ఇప్పటి వరకూ ప్రైవేటు విద్యాసంస్థలు ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని మౌఖిక ఆదేశాలతో ఉద్యోగాల నుంచి తొలగించినట్లు, జీతాలు ఇవ్వట్లేదని ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. తక్షణమే సిబ్బందికి జీతాలు అందించాలని, తొలగించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను బేఖాతరు చేసే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: