No sugar in ration: రేషన్‌కార్డులపై సరఫరా చేసే కందిపప్పు, పంచదారకు ప్రభుత్వం కోత పెట్టింది. సెప్టెంబరులో పంపిణీకి సంబంధించి వివిధ మండలాల్లోని డీలర్లకు ఇవి అందలేదు. కందిపప్పు సరిపడా లేదని, ఉన్న నిల్వలనే సర్దుబాటు చేస్తున్నామని, నాఫెడ్ నుంచి రావాల్సి ఉందని పౌరసరఫరాల శాఖ చెబుతోంది. ఈ లోగా రేషన్ పంపిణీ సమయం పూర్తయిపోతోంది. బహిరంగ మార్కెట్లో కిలో రూ.125 నుంచి రూ.135 వరకు పలుకుతోంది. రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు కిలో రూ.67 చొప్పున అందిస్తున్నారు. అంటే కార్డుదారులు బయట కొనాలంటే కిలోకు రూ.60పైనే అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. రేషన్ కార్డుదారులకు కొన్ని నెలలుగా కందిపప్పు, పంచదారను కేటాయింపు మేరకు సరఫరా చేయడం లేదని డీలర్లు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.45 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. నెలకు 14,520 టన్నుల మేర కందిపప్పు సరఫరా చేయాలి. 90% మంది రేషన్ తీసుకునే లెక్క ప్రకారం చూసినా... 13 వేల టన్నులైనా దుకాణాలకు చేర్చాలి. అయితే వాస్తవ సరఫరా అందులో సగం కూడా ఉండటం లేదు. ఆగస్టులో 4,800 టన్నులు మాత్రమే అందింది. జులైలో 4,800 టన్నులు, మేలో 6,352 టన్నులను మాత్రమే పంపిణీ చేశారు. పంచదార సరఫరా కూడా అందరికీ లేదు. సెప్టెంబరుకు సంబంధించి మొత్తంగా 2వేల టన్నులు కూడా అందలేదని డీలర్లు వాపోతున్నారు. పంచదార నెలకు 4,655 టన్నుల చొప్పున అవసరం కాగా.. కార్డుదారులకు మూడో వంతు పంపిణీ కూడా లేదు. కొన్ని జిల్లాల్లో అసలు సరఫరానే నిలిపేశారు.
డీడీలు తీసినా అందని సరకు
రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు సరఫరా చేయడం లేదని ఆగస్టులో ఫిర్యాదు అందడంతో కొందరు కలెక్టర్లు డీలర్ల ద్వారా డీడీలు తీయించారు. వారికి ఆగస్టులో కందిపప్పు సరఫరా కాలేదు. సెప్టెంబరులోనూ ఇవ్వలేదు. ఉన్న నిల్వలతోనే సర్దుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 550 టన్నుల కందిపప్పు అవసరమైతే 250 టన్నులే అందుబాటులో ఉంచారు. 250 టన్నుల పంచదారకు 100 టన్నులు మాత్రమే సరఫరా అయింది.
* పల్నాడు, బాపట్ల, నెల్లూరు, గుంటూరు, కడప, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, నంద్యాల, కర్నూలు, కృష్ణా, ఎన్టీఆర్ తదితర జిల్లాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎప్పుడు వస్తుందో చెప్పలేమంటున్నారని కొందరు డీలర్లు వివరిస్తున్నారు. దీంతో మొబైల్ వాహనదారులు బియ్యం పంపిణీకి మాత్రమే పరిమితమవుతున్నారు.
ఇవీ చదవండి: