పోలవరం ప్రాజెక్టులో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల పరిశీలనకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. విధివిధానాలపై అధ్యయనం చేసి మూడునెలల్లోపు నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు దాఖలుచేసిన కేసును విచారించిన అనంతరం ట్రైబ్యునల్ ఈ ఉత్తర్వులిచ్చింది. ఈ కమిటీ అయిదు అంశాలపై అధ్యయనం చేయాలని ఎన్‌జీటీ నిర్దేశించింది.
1. పోలవరం ప్రాజెక్టు నుంచి ఎంతమేర వ్యర్థాలు వెలికితీశారు? అందులో ఎంత భాగాన్ని డంపింగ్ సైట్‌లో పారబోశారు?
2. దీనివల్ల పర్యావరణానికి ఎంతమేర నష్టం జరిగింది? దిద్దుబాటు చర్యలేంటి?
3. భూమి కోల్పోయినవారికి ఇంకాపరిహారంచెల్లించాలా?
4. ప్రాజెక్టు వ్యర్థాల పరిమాణంపై ఆడిట్ నిర్వహణ
5. ఇతరత్రా ఏదైనా అంశాలపైనా పరిశీలించాలి.
కమిటీ కనీసం ఒకసారైనా ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించాలని, అవసరమైతే ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాలని పేర్కొంది. కేసు దాఖలుచేసిన పుల్లారావుకు ఖర్చుల కింద పీసీబీ రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది. కేసు విచారణను ఆగస్టు 9వ తేదీకి వాయిదావేసింది. గతంలో ఎల్‌జీ పాలిమర్స్ ఘటనపైనా జస్టిస్ శేషశయనారెడ్డి కమిటీనే ఎన్‌జీటీ నియమించింది.
ఇదీ చదవండి: సీడ్‌యాక్సెస్ రోడ్డును వదిలేసి కరకట్ట రోడ్డుకు తొలి ప్రాధాన్యం