మెజార్టీ ప్రజల గొంతుక అయిన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కుల పరిరక్షణకు.. న్యాయసమీక్ష తప్పనిసరి అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. న్యాయస్థానాలు అన్నివేళలా శాసనవ్యవస్థలో జోక్యం చేసుకోబోవని.. ప్రజల హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు తప్పకుండా చట్టాలని సమీక్షిస్తాయని చెప్పారు. బెంగళూరు అడ్వకేట్స్ అసోసియేషన్ 'కౌంటర్ మెజారిటేరియన్ డిఫికల్టీ' అనే అంశంపై నిర్వహించిన వెబినార్లో ఆయన పాల్గొన్నారు.
శాసనవ్యవస్థలో న్యాయస్థానాల జోక్యంపై అన్ని దేశాల్లోనూ చర్చ నడుస్తూనే ఉంది. అమెరికాలో 200 ఏళ్లుగా దీని గురించి చర్చ జరుగుతోందని కొన్ని విషయాలను జస్టిస్ లావు నాగేశ్వరరావు ఉదహరించారు. మెజార్టీ ప్రజల మనోభావాలకు ప్రతీకగా నిలిచే ప్రజాస్వామ్యంలో.. శాసనవ్యవస్థ చేసే చట్టాలను సమీక్షించకపోతే.. సమతూకం ఉండదన్నారు. న్యాయ సమీక్షాధికారాన్ని మెజార్టీ రాజకీయాలతో అణచడం అప్రజాస్వామికమే అవుతుందన్నారు. అందుకే మన దేశంలో కూడా రాజ్యాంగ నిర్మాతలు ఉన్నత న్యాయస్థానాలకు న్యాయ సమీక్షాధికారాన్ని కల్పించినట్లు గుర్తు చేశారు.
అవసరం అయినప్పుడే..
ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకున్న సభ్యులు చేసిన చట్టాలను.. ప్రజలు ఎన్నుకోని కొంతమంది న్యాయమూర్తులు నిర్ద్వందంగా తోసి పుచ్చుతున్నారనే విమర్శలు దశాబ్దాలుగా అన్నిచోట్లా ఉన్నాయని జస్టిస్ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు. కానీ మనదేశంలో న్యాయస్థానాలు అన్ని సందర్భాల్లో శాసనవ్యవస్థలో జోక్యం చేసుకోవడం లేదన్నారు. అలా చేయడం కూడా సబబు కాదని వ్యాఖ్యానించారు. చట్టాలను చేసినటువంటి పార్లమెంట్, లేదా ఏదైనా చట్టసభకు ఆ చట్టం చేసేటటువంటి అధికారం ఉందా..? ఆ చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా అన్న రెండు విషయాలనే న్యాయస్థానాలు పరిశీలిస్తాయని చెప్పారు. చట్టాలు చేసిన సభ్యుల జ్ఞానం, విజ్ఞత, వారి ఉద్దేశ్యాలు వంటి విషయాలను కోర్టులు పరిగణనలోకి తీసుకోవన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను పొందడంలో వ్యక్తులకు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకునే అధికారాన్ని ఆర్టికల్ 32 కల్పిస్తోందని... రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఈ ఆర్టికల్ రాజ్యాంగానికి గుండె వంటిదిగా అభివర్ణించారని ఆయన చెప్పారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన అనేక సందర్భాల్లో ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుందన్నారు. శాసన, కార్య నిర్వాహక, న్యాయ వ్యవస్థలు తమ పరిధుల మేరకు వ్యవహరిస్తేనే పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా ఉంటుందని చెప్పారు.