Jayashankar university: వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో సీట్లు పెంచాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తాజాగా నిర్ణయించింది. రాజన్న సిరిసిల్ల, వరంగల్, పాలెం (నాగర్‌కర్నూల్ జిల్లా)లోని మూడు వ్యవసాయ కాలేజీల్లో ప్రస్తుతం 60 చొప్పున సీట్లు ఉండగా ఈ ఏడాది నుంచి వాటిని 120కి పెంచారు. 180 సీట్లు పెరగడంతో ఈ వర్సిటీ పరిధిలోని ఆరు ప్రభుత్వ కళాశాలల్లో కలిపి మొత్తం సీట్ల సంఖ్య 840కి చేరింది.
ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేయడానికి వర్సిటీ తాజాగా ప్రకటన జారీచేసింది. బుధవారం నుంచి వచ్చే నెల 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. దరఖాస్తు రుసుము కింద ఎస్సీ, ఎస్టీలు రూ.900, ఇతరులైతే రూ.1800 చెల్లించాలి. వీటితో పాటు కొండా లక్ష్మణ్ ఉద్యాన, పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయాల పరిధిలోని ఉద్యాన బీఎస్సీ, బీవీఎస్సీ (పశువైద్య), బీఎఫ్‌ఎస్సీ (మత్స్యశాస్త్రం) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్‌ను జయశంకర్ వర్సిటీ నిర్వహిస్తోంది.
ఎంసెట్‌లో పొందిన ర్యాంకు ఆధారంగా ఈ సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. మెరిట్ ర్యాంకు ప్రకారం ఉచితంగా సీటు పొందితే ఏజీ బీఎస్సీకి రూ.39,000, పశువైద్య డిగ్రీకి రూ.55,800, బీఎఫ్‌ఎస్సీ (మత్స్యశాస్త్రం)కి రూ.42,290, ఉద్యాన బీఎస్సీకి రూ.47,090 చొప్పున రుసుం చెల్లించాలి. ఇవి కాకుండా ‘సెల్ఫ్ ఫైనాన్సింగ్’ కోటా కింద సీటు పొందితే ఏజీ బీఎస్సీకి రూ.14 లక్షలు, ఉద్యాన బీఎస్సీకి రూ.9 లక్షల చొప్పున విద్యార్థులు ఫీజు చెల్లించాలని జయశంకర్ వర్సిటీ స్పష్టం చేసింది.
ఈ మూడు డిగ్రీల్లో ‘రైతు కుటుంబం’ పిల్లలకు ప్రత్యేకంగా 40 శాతం సీట్లను రిజర్వు చేశారు. ఎంబీబీఎస్, బీడీఎస్ డిగ్రీ కోర్సుల్లో సీట్ల భర్తీకి తొలి రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయిన తరవాత మాత్రమే వ్యవసాయ డిగ్రీ కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు జయశంకర్ వర్సిటీ రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్ తెలిపారు.
ఇవీ చదవండి: