జనసేన అధినేత పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల బాధ్యుడు నాదెండ్ల మనోహర్‌తో కలిసి హస్తినకు పయనమయ్యారు. మంగళవారం ఉదయం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, ఇరు పార్టీల సమన్వయం, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి వ్యవహారాలపై కీలకంగా చర్చించే అవకాశముంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన, భాజపాతో కలిసి పనిచేసే అంశంపైనా చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ భేటీలో భాజపా ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మురళీధరన్ కూడా పాల్గొనే అవకాశముంది.
తిరుపతి ఉప ఎన్నికపై చర్చ!
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో జనసేన పోటీ చేసే యోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. జేపీ నడ్డాతో జరిగే సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పోలవరం విషయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య రోజురోజుకు అంతరం పెరుగుతున్న కారణంగా ప్రాజెక్టు నిర్మాణంపై సందిగ్ధత నెలకొంది. అదేవిధంగా అమరావతి విషయంలో భాజపా నేతలు పలు విధాలుగా మాట్లాడటం వల్ల అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొన్న విషయాన్ని పవన్ కల్యాణ్ జేపీ నడ్డా వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి