ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చినట్లుగా తాను రాలేదని.. రైతులకు భరోసా ఇవ్వడానికే వచ్చినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్న పవన్ యర్రబాలెంలో మహిళలతో కలిసి దీక్షలో కూర్చున్నారు. వారినుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయమని.. అది గతంలోనే జరిగిపోయిందన్నారు. గత ప్రభుత్వం నిర్ణయించినప్పుడు వైకాపా ఒప్పుకుందని.. ఇప్పుడు రాజధానిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. భాజపాతో కలిసి రాజధాని ఎక్కడికి పోదనే భరోసా ఇవ్వడానికి వచ్చినట్లు స్పష్టంచేశారు.
రైతులకు మద్దతుగా ర్యాలీ చేద్దామనుకున్నామని.. అయితే, దిల్లీ ఎన్నికల కారణంగా వాయిదా వేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని విస్తృత అధికారాలు ఉంటాయని.. కొన్నిసార్లు కేంద్రం కూడా ఏమీ చేయలేను పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులకు అండగా ఉంటామని భాజపా పెద్దలు చెప్పారన్నారు. అన్నదాతలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి.. 60వ రోజు రాజధాని రైతుల ఆందోళన..ఇద్దరు యువకుల దీక్ష