దేశంలో ప్రతి ఇంటికి శుద్దమైన తాగు నీరు అందించే హర్ ఘర్ జల్ కార్యక్రమంలో తెలంగాణ మెరుగైన పని తీరు చూపుతోందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు తాగు నీటి సరఫరా, ప్రతి ఇంటికి నీరు అంశంపై అన్ని రాష్ట్రాల మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్ష జరిపిన కేంద్ర మంత్రి... ఆయా రాష్ట్రాల్లో పురోగతి వివరాలను వెల్లడించారు.
2024 నాటికి గ్రామీణ భారతంలోని ప్రతి ఇంటికి తాగు నీరు సరఫరా చేసే వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. కరోనా మహమ్మారి ప్రభలంగా ఉన్న సమయంలో కూడా.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రతి ఇంటికి నల్లా నీరు అందించే జల్ జీవన్ మిషన్ పనులు కొనసాగించాయని అభినందించారు.
2.55 కోట్ల కుటుంబాలకు తాగునీరు సరఫరా
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకంలో వెచ్చించే నిధులు, పనితీరు ఆధారంగా ప్రోత్సాహక గ్రాంట్లు కేంద్రం ఇస్తోందని పేర్కొన్నారు. మొత్తం ఈ పథకం కోసం 3.60 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించగా.. కేంద్రం తన వాటాగా 2.08 లక్షల కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. జల్ జీవన్ మిషన్ ప్రారంభించిన 2019 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 3.23 లక్షల కుటుంబాలకు మాత్రమే నల్లా నీరు అందుబాటులో ఉండేదని... అతి కొద్ది కాలంలోనే 2.55 కోట్ల కుటుంబాలకు సురక్షితమైన తాగునీరు సరఫరా చేస్తున్నట్లు షెకావత్ తెలిపారు.
అగ్రస్థానంలో గోవా
నల్లా నీరు సరఫరాలో గోవా అగ్రభాగాన నిలిచిందని.. నిర్ధేశిత లక్ష్యం ప్రకారం.. ఆ రాష్ట్రంలోని 53,505 గ్రామాలకు సురక్షిత నీరు అందిస్తూ.. జల్ జీవన్ మిషన్‌లో తొలి స్థానంలో నిలిచినట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం సమర్దంగా అమలు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని నిపుణులైన వారికి ఉపాధి అవకాశాలు కూడా లభించినట్లు తెలిపారు.
జల్ జీవన్ మిషన్ ఆయా రాష్ట్రాల్లో ఉన్న పురోగతి వివరాలను వెల్లడించిన కేంద్ర జల శక్తి మంత్రి... గోవాలో కార్యక్రమం పూర్తి అయ్యిందని... తెలంగాణ, బీహార్, పుదుచ్ఛేరి, అండమాన్ నికోబార్ దీవులు 2021 నాటికి పూర్తి చేయనున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, అసోం, జార్ఘండ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమ బంగ రాష్ట్రాల్లో 2024 ఏడాదికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. మిషన్ అమలులో ఆంధ్రప్రదేశ్ తీరు మోస్తరుగా ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: