'జగనన్న విద్యాకానుక' పథకాన్ని ఈనెల ఎనిమిదో తేదీన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జడ్పీ హైస్కూలులో ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఉదయం 10.20 గంటలకు జడ్పీ హైస్కూలుకు సీఎం చేరుకుని... పాఠశాల విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడతారు. అనంతరం విద్యాకానుకను ప్రారంభిస్తారు. కొవిడ్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పరిమిత సంఖ్యలో ప్రజలను మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు.
ప్రభుత్వ పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు విద్యాకానుక కిట్‌లను అందించనున్నారు. ప్రతి విద్యార్థికి కిట్‌లో 3 జతల యూనిఫామ్‌లు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్ పాఠ్యా పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఒక స్కూల్ బ్యాగ్ ఉంటాయని మంత్రి తెలిపారు. నాడు - నేడు కార్యక్రమంతో పాఠశాలలు కొత్త శోభ సంతరించుకుంటున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్థులకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో కిట్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. బడిబయట పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించడం, తద్వారా పాఠశాలల్లో పిల్లల నమోదు శాతం పెంచడంతో పాటు అభ్యసనా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేలా చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని మంత్రి వివరించారు.
ఇదీ చదవండీ...