తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై సీఎం సమీక్షించారు. సచివాలయాల్లో సామాజిక తనిఖీ మార్గదర్శకాలను విడుదల చేసి మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు 90 రోజుల సమయం నిర్దేశించుకున్నట్లు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమీక్షలో పాల్గొన్న అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎం వారికి చెప్పారు.
ఇళ్ల పట్టాలు, పింఛను, బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎవరు దరఖాస్తు చేసుకున్నా నిరంతరం అనుశీలిస్తూ పరిష్కరించే లక్ష్యంతో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని సీఎం జగన్ ప్రకటించారు. గ్రామ సచివాలయ ఉద్యోగి నుంచి ఎమ్మార్వో, ఎంపీడీవో, చివరకు సంబంధిత శాఖ కార్యదర్శి స్థాయి వరకూ అనుశీలన సాగుతుందని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చే వినతుల్ని గడువులోగా పరిష్కరించేలా పర్యవేక్షించేందుకు పర్సుయేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) వ్యవస్థను సీఎం జగన్ సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో చేసుకున్న దరఖాస్తు ఎక్కడ ఆగినా సంబంధిత అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసేలా పీఎంయూ వ్యవస్థ రూపొందించారు. దరఖాస్తు పెండింగులో ఉంటే ఉదయం డిజిటల్ సందేశం పంపిస్తారు. మధ్యాహ్నంలోగా అది పరిష్కారంకాకపోతే నేరుగా సంబంధిత సిబ్బందికి పీఎంయూ వ్యవస్థ నుంచి ఫోన్ చేస్తారు. ఇందుకోసం పీఎంయూలో 200 మంది సిబ్బంది అందుబాటులో ఉంచారు. పీఎంయూ ద్వారా మొదట 4 సేవలపై పర్యవేక్షణ ఉంటుంది. అక్టోబరు నుంచి 543 సేవలను పర్యవేక్షిస్తారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. బియ్యం కార్డులు, పింఛను 10 రోజుల్లో, ఆరోగ్యశ్రీ కార్డు 20 రోజుల్లో, ఇంటి పట్టా 90 రోజుల వ్యవధిలో కచ్చితంగా రావాలని స్పష్టం చేశారు.
అలసత్వం ఎక్కడున్నా...
గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలందించేలా వాటిలో ఖాళీలను సెప్టెంబరులోగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘ప్రజా వినతుల విషయంలో అలసత్వం ఎక్కడున్నా తెలియాలి. గ్రామ సచివాలయాల్లో చేసుకున్న దరఖాస్తులు నిర్ణీత సమయంలోగా పరిష్కారం కాకపోతే కారణం ఏమిటో సీఎం కార్యాలయానికి తెలియాలి. వెంటనే సంబంధిత జిల్లా కలెక్టర్, జేసీతో మాట్లాడేలా వ్యవస్థ ఉండాలి. కాల్‌సెంటర్‌లోనూ జవాబుదారీతనం ఉండాలి. కాల్‌సెంటర్‌తో పాటు దరఖాస్తుల పెండింగ్‌పై శాఖ కార్యదర్శి, కలెక్టర్, జేసీ తదితర స్థాయి అధికారులకు అలర్ట్స్ వెళ్లేలా ప్రత్యామ్నాయ వ్యవస్థ అవసరం’ అని సూచించారు.
సచివాలయాలకు అంతర్జాల సదుపాయం
మారుమూల ప్రాంతాల్లోని సచివాలయాలకు అంతర్జాల సదుపాయాన్ని సీఎం ప్రారంభించారు. వ్యవస్థీకృత బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుతో ఈ సచివాలయాలకు ప్రభుత్వం అంతర్జాల సదుపాయాన్ని కల్పించింది. ఇంటర్‌నెట్ అందుబాటులో లేని 512 సచివాలయాలను ఈ విధానం ద్వారా అనుసంధానిస్తారు. మొదటగా 213 సచివాలయాలకు అంతర్జాల సదుపాయం కల్పించారు. మిగిలిన వాటికి రానున్న 2 నెలల్లో కల్పిస్తారు.
ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటుంది: తెలంగాణ సీఎం కేసీఆర్