బీసీ కేటగిరీలోని 139 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు తెస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజా సాధికార సర్వే ఆధారంగా...కులాల వారీ జనాభా లెక్కలను ప్రభుత్వం సేకరించింది. వెయ్యి లోపు జనాభా ఉన్న కులాలు 24 ఉన్నాయి. 2 వేల లోపు జనాభా ఉన్న కులాలు 37 ఉన్నట్లు తేలింది.
జనాభా తక్కువగా ఉన్న దృష్ట్యా ప్రతి కుటుంబానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆర్థికంగా భారమవుతుందని భావించిన అధికారులు.. వృత్తి సామీప్యత ఉన్న కులాలకు కలిపి 16 కార్పొరేషన్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి అదనంగా మరికొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి సూచనలు రావడంతో 42 కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
బీసీ సంక్షేమ శాఖపై సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ల ఏర్పాటుపై పూర్తి స్పష్టత రానుంది. రాయితీ రుణాలు ఇచ్చేందుకు ఇప్పటి వరకు ఉన్న విధానంలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు తెలిసింది. ఇకపై కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్లలో ఆయా కులాల వారు సభ్యులుగా చేరితేనే రాయితీ రుణాలు ఇచ్చేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రసుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈబీసీ మైనార్టీ కార్పొరేషన్లు ఉండగా.. ఆయా వర్గాలకు చెందిన వారు సభ్యులుగా ఉండాల్సిన అవసరం లేదు. ఇకపై సభ్యులుగా చేరితేనే రుణాలు ఇచ్చేలా మార్పులు చేయనున్నట్లు తెలిసింది. వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేలా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:పొరుగుసేవలు ప్రభుత్వపరం... వెనుకబడిన వర్గాలకు 50 శాతం