న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై.. సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ లలిత్ కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వీటిని విచారించింది. పిటిషన్లలో వాది, ప్రతివాదుల్లో ఒకరి తరపున న్యాయవాదిగా పనిచేసిన సమయంలో వాదనలు వినిపించినందున తాను ఈ కేసు విచారణ చేపట్టలేనంటూ ధర్మాసనం నుంచి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ తప్పుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించిన మరో ధర్మాసనం విచారణ జాబితాలో ఈ కేసును చేర్చనున్నట్లు జస్టిస్ యూయూ లలిత్ స్పష్టం చేశారు. దీంతో వచ్చే సోమవారం మరో ధర్మాసనంలో ఈ పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఎవరెవరు పిటిషన్లు వేశారంటే?
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లేఖ రాయడం, దానిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం బహిర్గతం చేయడంపై సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. అవి ఇవాళ విచారణకు వచ్చాయి. జడ్డిలపై ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం మీడియా సమావేశం నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ పిటిషన్ వేశారు. న్యాయస్థానాలపై భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేయకుండా ప్రతివాదిపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. సీఎం జగన్‌కు షోకాజు నోటీసులు ఇవ్వాలని పిటిషన్‌లో సునీల్ కుమార్ సింగ్ కోరారు.
న్యాయమూర్తులపై నిరాధార ఆరోపణలు చేసిన జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ మరో పిటిషన్ వేశారు. వ్యక్తిగత ప్రయోజానాల కోసం ముఖ్యమంత్రి పదవికి అపకీర్తి తెస్తూ బహిరంగంగా నిరాధార ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు. సీజేఐకు రాసిన లేఖను బహిర్గతం చేసిన జగన్, ఆయన సలహాదారుపై చర్యలు తీసుకోవాలని యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ మరో పిటిషన్ వేసింది. ఈ మూడు పిటిషన్లు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ రవీంద్ర భట్‌తో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి. అయితే ఈ విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ లలిత్ కుమార్ ప్రకటించారు.
ఇదీ చదవండి: