తెలంగాణలో... జనన, మరణ ధ్రువపత్రాల జారీ అవినీతికి కేంద్రంగా మారింది. ముడుపులు ఇవ్వనిదే దస్త్రం కదలని దుస్థితి నెలకొంది. 6 నెలల కాలంలో జన్మించిన శిశువుల దరఖాస్తులు పెద్దఎత్తున పెండింగులో ఉండటం ఇందుకు నిదర్శనం. మరణ ధ్రువపత్రాల దరఖాస్తులనూ సిబ్బంది వసూళ్లకు వాడుకుంటుండటం విస్మయం కలిగిస్తోంది.
ఏఎంఓహెచ్, ఏఎంసీలు ఉన్నారని, హెల్త్ అసిస్టెంట్లతో బేరసారాలు నడిపిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఈటీవీ భారత్ పరిశీలనలో తేలింది. దరఖాస్తు చేసిన 15 రోజుల్లో పౌరులకు ధ్రువపత్రం అందాల్సి ఉండగా ఈ ప్రక్రియ వసూళ్లకు ప్రధాన వనరుగా మారింది.
నిలోఫర్ ఆస్పత్రివే 5 వేలు పెండింగు...
నిలోఫర్ ఆస్పత్రిలో 6 నెలలుగా 5 వేల శిశువుల దరఖాస్తులు అటకెక్కాయి. వసూళ్లకు సహకరించడం లేదని మహిళా డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను 2 నెలలుగా కార్యాలయానికి రానివ్వట్లేదు. రోజూ కార్యాలయం చుట్టూ తిరగలేక పౌరులు మధ్యవర్తులను సంప్రదించి ఒక్కో దరఖాస్తుకు రూ.వెయ్యి నుంచి రూ.3 వేలు చెల్లించి ధ్రువపత్రాలు పొందుతున్నారు. 6 నెలల కాలంలో 3,500 దరఖాస్తులు ఒక్క చార్మినార్ సర్కిల్‌లో పెండింగులో ఉన్నాయి. మల్కాజిగిరి సర్కిల్‌లో దరఖాస్తులను 5 నెలలుగా పక్కనపెట్టారు.
బతికుండగానే చంపేశారు..
దుబాయ్‌లోని వ్యక్తికి కార్వాన్ ఉన్నతాధికారి.. మరణ ధ్రువపత్రం ఇచ్చారు. కొందరు ఆ ధ్రువపత్రాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నంలో కుటుంబసభ్యులకు చిక్కారు. ఖైరతాబాద్ సర్కిల్‌లో అయితే ఓ వ్యక్తి అక్రమ సంతానానికీ ధ్రువపత్రాలు ఇచ్చేశారు.
బదిలీ చేసినా అక్కడే విధులు..
జనన, మరణ ధ్రువపత్రాలు జారీ చేసే అధికారాన్ని జీహెచ్‌ఎంసీ పొరుగు సేవల సిబ్బందికి అప్పగించింది. ఇదే అదనుగా కొందరు అవినీతికి తెరలేపారు. ఇప్పటి వరకు సుమారు 10 మంది హెల్త్ అసిస్టెంట్లపై కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: అనపర్తి, బిక్కవోలులో తీవ్ర ఉద్రిక్తత.. 144 సెక్షన్ విధింపు