వ్యక్తుల శరీరతత్వాన్నిబట్టి కరోనా ప్రభావం కనిపిస్తోందని ప్రముఖ వైద్య పరిశోధకురాలు డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ తెలిపారు. శరీరంలోకి వైరస్ బాగా విస్తరించిన వారి ఆరోగ్యం విషమిస్తోందని వెల్లడించారు. కోలుకున్న వారిలో పలువురిపైనా వైరస్ ప్రభావం దీర్ఘకాలంగా కనిపించవచ్చని వివరించారు. వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలపై ‘ఈనాడు-ఈటీవీ భారత్ ’కు ఆమె ఈమెయిల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. గగన్‌దీప్‌కాంగ్ తమిళనాడు వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో మెడికల్ రీసెర్చి శాస్త్రవేత్తగా, జీర్ణకోశశాస్త్ర విభాగ ఆచార్యురాలిగా సేవలందిస్తున్నారు. ఫరీదాబాద్‌లోని డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ)లో ట్రాన్స్‌లేషన్ హెల్త్ సైన్సెస్‌లో కార్యనిర్వాహక సంచాలకురాలిగానూ పని చేస్తున్నారు. పిల్లల్లో వైరల్ ఇన్‌ఫెక్షన్లపై, రోటా వైరస్‌పై అధ్యయనం చేస్తున్నారు. రాయల్ సొసైటీ ఫెలోషిప్ అందుకున్న తొలి భారతీయ మహిళ ఆమె. ఇంటర్వ్యూ వివరాలివి.
రానున్న కాలంలో వైరస్ ప్రభావం ఎలా ఉంటుంది?
మరింత ప్రమాదకరంగా మారుతుందని చెప్పలేం. వైరస్ తీవ్ర స్థాయిలో సంక్రమించాక క్రమేణా బలహీనపడే అవకాశాలున్నాయి. దీనికి ఎంత సమయం పడుతుందన్నది ఇప్పుడే చెప్పలేం. మనిషి శరీరంలోకి వైరస్ చేరాక వేగంగా వృద్ధి చెంది ఇతరులకు సంక్రమిస్తోంది.
మన దేశంలో వైరస్ వ్యాప్తి గరిష్ఠ స్థాయిలో (పీక్ స్టేజి) ఉందని భావించవచ్చా?
ఆయా రాష్ట్రాల్లోని కేసుల నమోదునుబట్టి గరిష్ఠ స్థాయి ఆధారపడి ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం రకరకాలుగా ఉంటోంది. పాజిటివిటీ రేట్ ఎక్కువగా ఉన్నందున ‘గరిష్ఠం’ అన్నది ఇప్పుడే చెప్పలేం. కేసులు పెరిగే అవకాశాలున్నాయి. నిర్ధారణ పరీక్షల సంఖ్య ఇంకా పెంచితే మంచిది.
ఏపీలో వైరస్ ప్రభావం, వ్యాప్తి ఎలా ఉంది?
ఏపీలో ‘ఎపిడమిక్ కర్వ్’ను దేశంలోని పరిస్థితులతో పోలిస్తే కాస్త వెనకే ఉంది. రాష్ట్రంలో కేసుల నమోదు ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటిమాదిరి ఎక్కువ నిర్ధారణ పరీక్షలు, చికిత్స, ఐసొలేషన్ విధానాలు కొనసాగించాలి.
‘సిరో సర్వైలెన్స్’ ఫలితాలు సమాజంలో వైరస్ విస్తృతికి ఎంతమేర దర్పణం పడుతున్నాయి ?
ఈ ఫలితాలు జనసమ్మర్థమున్న ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని ప్రతిబింబిస్తాయి. వీటి ఆధారంగానే ‘వ్యాక్సిన్ ట్రయల్స్’ జరుగుతాయి. సిరో సర్వైలెన్స్ ఫలితాలను బట్టి యాంటీబాడీస్ వృద్ధి చెందినవారు ముంబయి, పుణెలలో ఎక్కువే ఉన్నారని తేలింది. ఈ నగరాలు హెర్డ్‌ఇమ్యూనిటీకి దగ్గరలో ఉన్నాయి.
వ్యాక్సిన్ ఉత్పత్తిలో రష్యా, అమెరికాతో పోల్చితే మన దేశంలో పురోగతి ఎలా ఉంది?
ఇక్కడ పోటీ ముఖ్యం కాదు. ప్రపంచమంతా సమస్యను ఎదుర్కొంటున్నందున సమన్వయంతో తయారీకి సిద్ధమవ్వాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడే చెప్పలేను.
సీటీస్కాన్ ఆధారంగా వైరస్‌ను నిర్ధారించడం, చికిత్స అందించడంపై మీరేమంటారు?
సీటీస్కాన్ ద్వారా ఊపిరితిత్తుల్లో వైరస్ ప్రభావం మాత్రమే తెలుస్తుంది. వైద్యుల పరిశీలన, ఆర్టీపీసీఆర్, ఇతర పరీక్షల ఆధారంగా రోగి ఆరోగ్య స్థితిపై అంచనాకు రావడం ముఖ్యం. లక్షణాలనుబట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి మాత్రలు, హెర్బల్స్ ఎంతవరకు దోహదపడతాయి?
ఇందుకోసం ఫలానా మాత్రలు, హెర్బల్స్ తీసుకోవాలన్న దానికి సరైన ఆధారాలు లేవు. మాస్కులను ధరించడం, ఎడం పాటించడం, చేతుల పరిశుభ్రతే రక్షణగా నిలుస్తాయి.
ఇదీ చదవండి:
స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై నేడు సుప్రీంకోర్టులో విచారణ