ఇంటర్మీడియట్‌లో హాజరు మినహాయింపు రుసుములను భారీగా పెంచుతూ ఇంటర్ విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. 60 నుంచి 75 శాతం హాజరు ఉన్న వారికి మినహాయింపు రుసుములను పెంచుతూ నిర్ణయించింది. 60 శాతంలోపు ఉంటే ప్రైవేటు విద్యార్థులుగా గుర్తించనున్నట్లు ప్రకటించింది.
60 నుంచి 75 శాతం లోపు హాజరు ఉన్నవారికి గతంలో 2 వందల నుంచి 5 వందల వరకూ ఉన్న రుసుములను ఒక్కసారిగా వెయ్యి నుంచి రెండు వేల వరకూ పెంచారు. సాధారణంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదవే పేద విద్యార్థులకు హాజరు తక్కువగా ఉంటుంది. కుటుంబ సమస్యలు, కులవృత్తుల కారణంగా కళాశాలలకు సక్రమంగా రాక హాజరు సమస్య ఏర్పడుతుంది. ప్రైవేటు కళాశాలల్లో ఉపకార వేతనాలు, ఇతర పథకాల కోసం హాజరు పూర్తిగా వేసే పరిస్థితి. దీంతో హాజరు మినహాయింపు రుసుములు చెల్లించేవారు ప్రైవేటు కళాశాలల్లో దాదాపు ఉండరు. అమ్మఒడి పథకంలో లబ్ధిదారుల ఎంపికకు హాజరును పట్టించుకోనివారు.. ఇప్పుడు పరీక్షల కోసం రుసుముల భారం మోపుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ట్స్ విభాగంలో రెగ్యులర్ విద్యార్థిగా కళాశాలలో ప్రవేశాలు పొంది 60 శాతం కంటే తక్కువ హజరుంటే వారిని ప్రైవేటు విద్యార్థులుగా పరిగణిస్తారు. మార్కుల జాబితాలో ప్రైవేటు అని వస్తుంది. హాజరు వినహాయింపునకు అదనంగా రూ. వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొదటి ఏడాది చదువుతున్న వీరికి రెండో ఏడాదిలో ఎలాంటి ప్రభుత్వ పథకాలు వర్తించవు.
ఇదీ చదవండి : చదువు 'గోడు' పట్టేదెవరికి.. ఈ 'గోడ' కట్టేదెన్నటికి..?