SUPREME COURT: పీడీ ఖాతాలకు మళ్లించిన రూ.1100 కోట్లను రాష్ట్ర విపత్తు సహాయనిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్) ఖాతాకు రెండు వారాల్లోగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొవిడ్ బాధిత కుటుంబాలకు పరిహారంగా చెల్లించాల్సిన నిధులను ఏపీ ప్రభుత్వం పీడీ ఖాతాలకు మళ్లించిందంటూ తెదేపా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది బసంత్ వాదనలు వినిపించారు. నిధులను ఎస్‌డీఆర్‌ఎఫ్ ఖాతాకు మళ్లిస్తామని తెలిపారు. మళ్లించిన నిధులకు వడ్డీతో కలిపి బదిలీ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ నిబంధనలను అనుసరించి నిధులు బదిలీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. పీడీ ఖాతాలకు మళ్లించిన రూ.1100 కోట్లను రెండు వారాల్లోపు ఎస్‌డీఆర్‌ఎఫ్ ఖాతాకు బదిలీ చేయాలని, కొవిడ్-19 బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఆదేశాలిచ్చింది. బాధితులు విజ్ఞప్తి చేస్తున్నా పరిహారం చెల్లించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పగా.. పిటిషనర్లు ఫిర్యాదుల పరిష్కార కమిటీని ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది. పరిహారం దక్కని వారి దరఖాస్తులు పరిశీలించి, నాలుగు వారాల్లో ఆ సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. కొవిడ్ పరిహారం చెల్లింపులో ఇతర రాష్ట్రాలకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. పిటిషన్ విచారణ నాటికి ఫిర్యాదు చేసిన నలుగురికి ఏపీ ప్రభుత్వం పరిహారం చెల్లించలేదని న్యాయవాది చెప్పారు. ఆ నలుగురికి ఇప్పటికే పరిహారం చెల్లించినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది వెల్లడించారు.
ఇవీ చదవండి: