అధికారులతో పరిశ్రమల మంత్రి వరుస భేటీలు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్త ఏడాదికి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పరిశ్రమల జాబితాను ఆధారలతో ప్రజల ముందుంచే దిశగా పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న కంపెనీల జాబితాపై అధికారులతో చర్చించారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు ఎన్ని కంపెనీలు పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయో అధికారులు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని 6 ప్రాజెక్టులు సమయం మించిపోయి వివిధ దశల్లో పూర్తికాకుండా ఆగిపోయినట్లు తమ దృష్టికి వచ్చిన విషయాన్ని మంత్రి అధికారుల వద్ద ప్రస్తావించారు. అలాంటి పరిశ్రమలకు తగిన సమయం ఇచ్చి, గడువు పెంచేలా ప్రభుత్వం సహకరిస్తే వాటి వల్ల 20 వేల మందికి ఉపాధి దొరుకుతుందని మంత్రి వెల్లడించారు. విద్యుత్, మైనింగ్ రంగాల్లో పెట్టుబడులకు ఆస్ట్రేలియా కంపెనీలు ఆసక్తి చూపిన వివరాలను అధికారులు మంత్రికి తెలిపారు. ఏపీఐఐసీ అనుసంధానంగా ఐటీ శాఖకు ప్రత్యేక ల్యాండ్ బ్యాంక్ పోర్టల్ ప్రతిపాదనను ఆ శాఖ ముఖ్యకార్యదర్శి కోన శశిధర్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మీసేవ ఉద్యోగుల సమస్యలపై ఐటీ మంత్రి సమీక్షలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇదీ చదవండి: పవన్ ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోం: బొత్స