Godavari Kaveri river Linkage: నదుల అనుసంధానంలో భాగంగా గోదావరిలో మిగులు జలాలను తరలించేందుకు జాతీయ జల అభివృద్ధి సంస్థ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. గతంలో ఆకినేపల్లి, జనంపేట, ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలు తరలించాలని ప్రతిపాదించగా.. తాజాగా తుపాకులగూడెం వద్ద నిర్మిస్తున్న సమ్మక్క ఆనకట్ట నుంచి నీటిని తరలించాలని ప్రతిపాదించింది.
గోదావరిలో తమ కేటాయింపులకు అనుగుణంగా పథకాలను సిద్ధం చేస్తున్నామని ఛత్తీస్గడ్ తెలిపినందున గతంలో ప్రతిపాదించిన 247 టీఎంసీలు కాకుండా.. తొలిదశలో 141 టీఎంసీలు మాత్రమే తరలించాలని ప్రతిపాదించారు. అందులో తెలంగాణలోని 2.88 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించేందుకు 42.6.. ఆంధ్రప్రదేశ్‌లో 2.21 లక్షల హెక్టార్లకు సాగునీరు ఇచ్చేందుకు 41.8 టీఎంసీలు కేటాయించారు.
తమిళనాడులో 1.18 లక్షల హెక్టార్లకు సాగునీటితోపాటు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు 38.6 టీఎంసీలు కేటాయించింది. తమకూ భాగస్వామ్యం కావాలన్న కర్ణాటక ఒత్తిడినేపథ్యంలో ఆరాష్ట్ర తాగునీటి అవసరాల కోసం 9.8.. పుదుచ్చేరి తాగునీటి కోసం 2.2 టీఎంసీలు ప్రతిపాదించారు. ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీలు తరలించాలన్న ప్రతిపాదనపై తెలంగాణ గతంలోనే అభ్యంతరం తెలిపింది.
తొలుత గోదావరిలో నీటి లభ్యత తేల్చిన తర్వాతే ముందుకెళ్ళాలని డిమాండ్‌చేయగా ఎన్‌డబ్ల్యూడీఏ సమ్మక్క ఆనకట్ట నుంచి నీటిని తరలించే ప్రతిపాదన తీసుకొచ్చింది. తొలి దశలో గోదావరిలో 141టీఎంసీల మిగులుజలాలను తరలించాలని సూచించింది. ఎగువన మహానది నుంచి గోదావరికి నీటిని తరలించాలని భావించారు. అయితే మహానదిలో మిగులు నీరులేదని ఒడిశా పేర్కొనడంతో హిమాలయ నదుల నుంచి మహనదికి నీటిని తరలించాకే.. అక్కడి నుంచి గోదావరికి మళ్లించాలని నిర్ణయించారు.
సమ్మక్క ఆనకట్ట నుంచి 141 టీఎంసీలు తరలించాలన్న ప్రతిపాదనపై జాతీయ జల అభివృద్ధి సంస్థ భాగస్వామ్య రాష్ట్రాలతో బెంగళూరులో సమావేశం ఏర్పాటుచేసింది. ఆ భేటీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, తదితర రాష్ట్రాల అధికారులను ఆహ్వానించారు. తెలంగాణ నుంచి ఈఎన్సీ మురళీధర్, ఇతర ఇంజనీర్లు సమావేశానికి హాజరుకానున్నారు.
కొత్త ప్రతిపాదనను ఎన్‌డబ్ల్యూడీఏ ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు పంపింది. ఆ ప్రతిపాదనపై రెండు తెలుగు రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయన్నది కీలకంగా మారింది. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకొని తదుపరి కార్యాచరణను జాతీయ జల అభివృద్ధి సంస్థ చేపట్టనుంది.