పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు మెంబర్లు చేయాల్సిన ఖర్చు వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం అభ్యర్థుల ఎన్నికల వ్యయం లెక్కకట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 10 వేలు అంత కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి రెండున్నర లక్షలు మించి ఖర్చు చేయకూడదని ఆదేశాలిచ్చింది. 10 వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల వ్యయం1.50 లక్షలకు పరిమితం చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
10 వేలు అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామంలో వార్డు సభ్యుడికి ఎన్నికల వ్యయం 50 వేలు మాత్రమే ఖర్చు చేయాలని సూచించింది. 10 వేల కంటే తక్కువ జనాభా కల్గిన గ్రామంలో వార్డు సభ్యుడికి ఎన్నికల వ్యయం 30వేలుగా నిర్ణయించారు. 13 జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఎఫ్ఎస్ అధికారులను నియమించిన ఎస్ఈసీ.. ఈ ఆదేశాలను అమలు చేయాలని సూచించింది. పంచాయతీ ఎన్నికల వ్యయ పరిశీలకులతో ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబు సమావేశమై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సాధారణ పరిశీలకులుగా ఉన్న ఐఎఎస్ అధికారులతో వ్యయ పరిశీలకులు సమన్వయం చేసుకోవాలని అధికారులను ఎన్నికల సంఘం కార్యదర్శి ఆదేశించారు.
ఇదీ చదవండి: నామినేషన్ వేసినపుడు.. నిమిషాలతో సహా ఎందుకు రాసుకుంటారంటే?