ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులు తేలేదాకా సీబీఐ కోర్టులో తనపై నమోదైన కేసు విచారణను నిలిపివేయాలని కోరుతూ నిందితురాలైన ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి సోమవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓబుళాపురం మైనింగ్ వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తునకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించగా కేవలం అక్రమ మైనింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని హైకోర్టు సూచించింది. గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) రెండు రాష్ట్రాల సరిహద్దులను చెరిపేసిందని, హద్దు రాళ్లను తొలగించి తవ్వకాలు చేపట్టిందన్నది సీబీఐ అభియోగం. ఈ కేసుపై సీబీఐ కోర్టులో బుధవారం విచారణ ఉన్నందున.. నిందితురాలైన శ్రీలక్ష్మి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి విచారణను నిలిపివేయాలని కోరారు. సరిహద్దు వివాదం తేలితేనే అక్రమ మైనింగ్ వ్యవహారం వెల్లడవుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు అనుకూల పరిస్థితుల్లేవు