తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో రెండో అతి పెద్ద జలాశయమైన కొండ పోచమ్మ సాగర్‌తో భాగ్యనగరంలో తాగునీటికి మరింత భరోసా దక్కనుంది. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనిద్వారా మండు వేసవిలోనూ గోదావరి జలాలను నగరానికి తీసుకురావచ్చు.
గోదావరి జలాల్లో భాగ్యనగర తాగునీటి అవసరాలకు 30 టీఎంసీల కేటాయింపులున్నాయి. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీలు తీసుకొచ్చి సరఫరా చేస్తున్నారు. కొండ పోచమ్మ సాకారంతో మరో 20 టీఎంసీలు నగరానికి తీసుకొచ్చేందుకు అవకాశం ఏర్పడింది.
కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్‌కు కేవలం 50 కి.మీ. దూరమే ఉండటం మరింత కలిసొచ్చే అంశం. ఇప్పటికే ఆ దిశగా జలమండలి అడుగులేస్తోంది. నీటిని తరలించడానికి కేశవాపూర్ వద్ద 5 టీఎంసీలతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించనుంది. పంపింగ్ ద్వారా నీటిని తీసుకొని శుద్ధిచేసి నగరానికి తీసుకురావాలన్నది తొలి ప్రణాళిక. ఈ ప్రాజెక్టుకు రూ.5 వేల కోట్లు వరకు ఖర్చు చేస్తున్నారు. యాన్యుటీ విధానంలో పనులు చేపడుతున్నారు. భూసేకరణ, పనుల్లో జాప్యం.. ఇతరత్రా కారణాలతో కేశవాపూర్ జలాశయం పూర్తికి మరో ఏడాదిన్నర కంటే ఎక్కువ సమయమే పట్టనుంది. ఈలోపు కొండపోచమ్మ నుంచి నేరుగా నీటిని తీసుకొనేందుకు ప్రతిపాదనలు చేశారు.
ఇదీ ప్రణాళిక
- కొండపోచమ్మ సాగర్ నుంచి 3600 ఎంఎం డయా సామర్థ్యంతో సమాంతరంగా 18 కి.మీ. మేర రెండు గొట్టపు మార్గాలు నిర్మించి కేశవాపూర్ రిజర్వాయర్‌ను నీటితో నింపుతారు.
- దీనికి మొత్తం 3800 ఎకరాల భూమి అవసరం. 600 ఎకరాల మేర ఉన్న పట్టా భూముల సేకరణ కొంత సంక్లిష్టంగా మారడంతో రిజర్వాయర్ సామర్థ్యాన్ని 5 టీఎంసీలకు తగ్గించారు.
- భాగ్యనగర నీటి అవసరాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం 700 మిలియన్ గ్యాలన్లు(ఎంజీడీలు) అవసరం ఉంది. 420 ఎంజీడీలకు మించి సరఫరా చేయడం లేదు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో మూడు, ఐదు రోజులకు ఒకసారి నీరు ఇస్తున్నారు.
- కొండపోచమ్మ నుంచి కేశవపూర్ రిజర్వాయర్‌కు పైపులు అనుసంధానం చేస్తూనే తాత్కాలికంగా నగరానికి నీటిని తరలించవచ్చని భావిస్తోంది. తొలుత పది కి.మీ. దూరంలో నీటి శుద్ధి కేంద్రం, క్లియర్ వాటర్ రిజర్వాయర్ నిర్మించి పైపులను అనుసంధానం చేస్తారు. అక్కడి నుంచి 10 కి.మీ. మేర భారీ పైపులు నిర్మించి అవుటర్ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్)లోని కండ్లకోయ వద్ద రింగ్ మెయిన్‌కు(భారీ పైపులైన్) కలుపుతారు.
- దీని ద్వారా మరో 172 ఎంజీడీల గోదావరి నీటిని తరలించేందుకు వెలుసుబాటు కలుగుతుంది. ఒకవేళ కొండపోచమ్మలో సరిపడా నీళ్లు లేకపోయినా పైన మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మకు తరలించవచ్చు.
- కేశవపూర్ రిజర్వాయర్ కాకుండా నీటి శుద్ధి కేంద్రం, పైపులు, మోటార్లు, పంపుల కోసం దాదాపు రూ.1221 కోట్లు ఖర్చవుతుందని జలమండలి అంచనా వేసింది. కొండపోచమ్మ జలాశయాన్ని ప్రారంభిస్తుండటంతో ఈ పనులకు చకచకా మోక్షం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: