మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త టి.సుబ్బరామిరెడ్డి సతీమణి ఇందిరా రెడ్డిని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందిరా రెడ్డి ఛైర్‌పర్సన్‌గా ఉన్న గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు చెందిన షేర్లను నిందితులిద్దరూ అక్రమంగా విక్రయించి రూ.11కోట్ల 50లక్షలు మోసం చేశారు. ముంబయికి చెందిన హర్షవర్దన్, చేతన్ కలిసి ఛాంపియన్ ఫిన్ సెక్ లిమిటెడ్‌కు డెరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. జూన్ 17న గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఛైర్పర్సన్ ఇందిరా రెడ్డిని కలిసిన హర్షవర్దన్, చేతన్... ఒక్క శాతం కమిషన్ తీసుకుని రుణం మంజురు అయ్యేలా చూస్తామని తెలిపారు. దీనికి అంగీకరించిన ఇందిరా రెడ్డి జీపీఎల్‌కు చెందిన షేర్లను తనఖా పెట్టేందుకు అంగీకరించారు.
ఒప్పందం ప్రకారం ఛాంపియన్ ఫిన్ సెక్ లిమిటెడ్ వద్ద అప్పటి షేర్ మార్కెట్ విలువ ప్రకారం రూ.11కోట్ల 50లక్షల విలువ చేసే 32లక్షల 50వేల జీపీఎల్ షేర్లను ఇందిరా రెడ్డి తనఖా పెట్టారు. జూలై 17వ తేదీ లోపు రుణం మొత్తం జీపీఎల్ ఖాతాలో జమ కావాల్సి ఉంది. కానీ రుణం మంజూరు కాకపోవడంతో గాయత్రి ప్రాజెక్ట్ లిమిటెడ్ అకౌటెంట్లకు అనుమానం వచ్చి షేర్లను పరిశీలించారు. నిందితులిద్దరూ కలిసి రూ.11కోట్లు విలువ చేసే షేర్లను బహిరంగా మార్కెట్లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు గుర్తించారు.
జులై 20వ తేదీన జీపీఎల్ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హర్షవర్దన్, చేతన్‌లను ముంబయిలో అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచి చంచల్ గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు. నిందితులిద్దరినీ వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
ఇదీ చదవండి:
CAR THEFT: టెకీ కారు కొట్టేశారు.. కానీ టెక్నాలజీకి దొరికేశారిలా..