ఓ డ్రోన్ పొలంలో మందులు చల్లుతుంది. ఇంకోటి మారుమూల పల్లెకు మందులు మోసుకెళ్తోంది. ఈ అధునాతన సాంకేతికత వెనుక ఉన్న ఆలోచనలు తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన మారుత్ డ్రోన్స్ వ్యవస్థాపకులు ప్రేమ్‌కుమార్, సూరజ్, సాయికుమార్‌లవి. ఇంక్యుబేటర్ల(Incubators) అండతో వారి ఆవిష్కరణ కార్యరూపం దాల్చింది. మీ మేధస్సులోనూ ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? అవి ప్రజలకు ఉపయోగపడతాయనే నమ్మకం ఉందా? వాటికి ఆవిష్కరణ రూపం వస్తే ఎందరికో ప్రయోజనం కలగడంతో పాటు... వ్యక్తిగతంగా ఎదిగేందుకు దోహదపడుతాయనే భావన మీలో ఉందా? సరిగ్గా మీలాంటి వారికోసమే హైదరాబాద్(Start- ups in Hyderabad)లో అనేక వేదికలున్నాయి. కేవలం ఆలోచన చెబితే చాలు అవసరమైన చేయూతనందిస్తాయి. నిపుణుల సూచనలు జోడించడంతో పాటు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తాయి. ఆయా వేదికలు ఏమిటి? వాటిని ఎలా సంప్రదించాలి? తద్వారా ఒనగూరే ప్రయోజనాలు ఏమిటి?
విదేశాలకు వీడియో కాలింగ్‌పై ‘లిబరో మీట్’ యాప్‌ను రూపొందించిన ‘సోల్‌పేజ్’ సంస్థ, కార్లపై ప్రకటనల్ని పరిచయం చేసిన ఆడాన్మో, వర్టికల్ వ్యవసాయంతో గుర్తింపు పొందిన అర్బన్ కిసాన్.. ఇలాంటి అనేక అంకురాల(Start ups)(స్టార్టప్‌ల)కు ప్రోత్సాహం అందిస్తున్నాయి ఇంక్యుబేటర్లు(Incubators). మార్కెట్లో రాణించేలా అనుభవజ్ఞుల సూచనలు, సలహాలతో యువత ఆలోచనలకు సాన పెడుతున్నాయి. ప్రభుత్వాల నుంచి సాయం అందేందుకు తోడ్పడుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం 30 దాకా ఇంక్యుబేటర్లు ఉన్నాయి. వాటి ఊతంతో అంకురాలకు రాజధానిగా మారుతోంది మన మహానగరం.
ఇంక్యుబేటర్లలో కొన్ని..
టీ-హబ్, వీ-హబ్, బయో హబ్, గచ్చిబౌలి ఐఐఐటీ సీఐఈ, ఐఐఐటీ హైదరాబాద్ మెడ్‌టెక్ ఇంక్యుబేటర్, హెచ్‌సీయూలోని బయోనెస్ట్, ఓయూలోని ఉస్మానియా టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్, ఐఎస్‌బీలోని డీ ల్యాబ్స్, ఎంఎన్ పార్క్‌లోని ఐ హబ్, లైఫ్ సైన్సెస్ ఇంక్యుబేటర్, ఐఐసీటీలోని సొసైటీ ఫర్ బయోటెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్, బేగంపేటలోని టీ-వర్క్స్, ఎస్‌ఆర్ ఇన్నోవేషన్ ఎక్స్ఛేంజ్, ఎంఎన్‌ఆర్ ఫౌండేషన్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటైన అగ్రీహబ్, ఇక్రిశాట్‌లోని అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్, ఐఐఎంఆర్‌లోని న్యూట్రీహబ్, ఐఐఐటీహెచ్‌లో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఐఐటీహెచ్‌లో ఎఐఎస్‌ఈఐ, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ అగ్రిప్రెన్యూర్‌షిప్.
ఆవిష్కరణలకు అండాదండా
రాష్ట్రంలో ఇప్పటివరకూ టీ-హబ్ ద్వారా 6,600లకు పైగా అంకుర సంస్థలకు చేయూత అందింది. ఇంక్యుబేటర్లను నేరుగా సందర్శించొచ్చు. ఆయా సంస్థల వెబ్‌సైట్లలో వివరాలు నమోదు చేసుకున్నా చాలు. వారు 5 మార్గాల్లో తోడ్పాటునందిస్తారు.
1 ఆలోచన ప్రజోపయోగమేనా? మార్కెట్లో రాణిస్తుందా? అనేది అంచనా వేయడం.
2 విజయం సాధించేందుకు పయనించాల్సిన మార్గాలపై నిపుణుల పాఠాలు.
3 అంకుర సంస్థలకు ఇతర ప్రాంతాల్లో కో-వర్కింగ్ స్పేస్‌లను కల్పించడం.
4 నిధుల సేకరణ, దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు వివిధ కార్యక్రమాల ద్వారా సాయం.
5 ఒకేరకమైన ఆలోచనతో నడుస్తున్న అంకురాల్లో వేటితో కలిస్తే ప్రయోజనమో తెలియజేయడం.
టీ-హబ్‌లోని కీలక విభాగాలు
టీ-ట్రైబ్
ఆలోచన దశలో ఉన్నవాటి కోసం కిక్ స్టార్ట్, అంకురం ప్రారంభదశలో ఉన్నవాటికి లాంచ్‌ప్యాడ్, మొదలైన వాటికి సాయమందించేందుకు మాస్టర్ ప్యాడ్ అనే మూడు విభాగాలు పనిచేస్తున్నాయి.
ఎకో-సిస్టం కార్యాలయం
అంకురాలు నడిచే వాతావరణం సృష్టించడంతో పాటు మార్కెట్లో పెట్టుబడులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, నిధుల సమీకరణ తదితర బాధ్యతల్ని ఈ విభాగం చూసుకుంటుంది.
అంతర్జాతీయ వేదిక
ఇక్కడి నుంచి విదేశాలకు, విదేశాల నుంచి ఇక్కడికి తరలే అంకుర సంస్థలను కలుపుతుంది. విదేశీ అంకుర సంస్థ ఆలోచన ఇక్కడ పనికొస్తుందనుకుంటే అవసరమైన వనరుల్ని అందిస్తుంది. ఆయా దేశాల రాయబారుల ద్వారా అంతర్జాతీయ సంస్థలను కలిసేందుకూ వేదికవుతోంది.
ఆలోచనలకు ఆచరణ
అంకుర సంస్థలకు ఇంక్యుబేటర్ల ద్వారా విశేష అవకాశాలు దక్కుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్‌చైన్, డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికతల్ని అభివృద్ధి చేసే అంకురాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. వీటిలో సత్తా ఉన్నవారు రాణించేందుకు అవకాశాలందిస్తోంది. టీహబ్ లాంటి వేదికల ద్వారా ఆలోచనలు ఆచరణలోకి వచ్చే దారి దొరుకుతోంది. -రమేశ్, సోల్‌పేజ్ వ్యవస్థాపకులు
ప్రభుత్వమే సంప్రదించింది
సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాల్లో అంకుర సంస్థలకు ప్రభుత్వంతోపాటు ఇంక్యుబేటర్ల నుంచి సాయమందుతోంది. ఆలోచన జనంలోకి చేరేందుకు, రాణించేందుకు మంచి వేదిక లభిస్తోంది. మా సంస్థ దివ్యాంగులకు అవసరమైన వస్తువులు తయారు చేస్తోందని తెలుసుకుని ప్రభుత్వమే సంప్రదించి.. ఉత్పత్తులకు ఆర్డరిచ్చింది. -ఆడెపు శ్రీనివాస్, ‘ఫ్లెక్స్ మోటివ్’ వ్యవస్థాపకులు
ఇదీ చదవండి: Ap new cabinet: కొత్త మంత్రిమండలి కూర్పుపై మంతనాలు షురూ