గుంటూరు జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 32 శాతం అధికంగా కురవటంతో... ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలు నీటమునిగాయి. కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో... పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరికొద్ది రోజుల్లో చేతికొస్తుందనుకున్న పంట కళ్లముందే వర్షార్పణం అయిపోవటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పొలాల్లో కుళ్లిపోతున్న పంటను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఇంకా నీటిలోనే...
అధిక పెట్టుబడులతో ముడిపడిన పత్తి, పొగాకు, తమలపాకు, పసుపు వంటి వాణిజ్య పంటలతోపాటు... ఆహార పంటలు వేసిన రైతులందరూ భారీ వర్షాలకు పూర్తిగా నష్టపోయారు. మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు, దుగ్గిరాల మండలాల్లో పొలాలు ఇంకా నీటిలోనే ఉండటంతో... తమ పెట్టుబడి డబ్బులూ రావని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి మండలం గుండిమెడ, చిర్రావూరు, కుంచనపల్లిలో కాయగూరలు, ఆకుకూరల పంటలు నీట మునిగాయి. వీటిని పరిశీలించిన వ్యవసాయ అధికారులు... జిల్లాలో 8 వేల 800 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేశారు. నీటమునిగిన ప్రతి సెంటుకూ పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వరదనీరు పూర్తిగా తొలగిన తరువాత పంట నష్టం వివరాలను పూర్తిగా లెక్తిస్తామన్నారు.
దుగ్గిరాల, కొల్లిపొర, కొల్లూరు, భట్టిప్రోలు ప్రాంతాలతోపాటు... లంక గ్రామాల్లో వరద నష్టం ఎక్కువగా ఉంది. వరదలు వచ్చిన ప్రతిసారీ తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.రేపల్లె మండలం పల్లిపాలెం గ్రామంలో వరద తీవ్రత తగ్గుముఖం పట్టకపోవటంతో.. కృష్ణా తీరప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. అగ్నిమాపక, వైద్య, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ.. సహాయకకార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరద వచ్చిన ప్రతిసారీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని... శాశ్వత పరిష్కారం చూపించాలని బాధితులు అధికారులను కోరారు.
ఇదీ చదవండి