హైదరాబాద్ కోకాపేటలోని భూములను వేలం వేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏడాది కిందట నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే 49.92 ఎకరాలను అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వెంచర్‌గా మార్చే పనిని హెచ్‌ఎండీఏ భుజానికెత్తుకుంది. ఈ మొత్తం భూమిని ఎనిమిది ప్లాట్లుగా విభజించింది. ఒక్కో ఎకరం కనీసం ధర రూ.25 కోట్లుగా నిర్ధారించింది. దీనికి అనుగుణంగా ఈ-వేలం నిర్వహించింది. ఈ వెంచర్‌కు నియోపొలిస్ అని పేరు పెట్టింది. అవుటర్ పక్కనే ఈ వెంచర్ ఉంది.
ప్రస్తుతం ఈ వెంచర్‌లోకి అవుటర్ నుంచి నేరుగా రావడానికి వీలులేదు. ఫైనాన్షియల్ జిల్లా నుంచి కోకాపేటకు రావాలంటే ఇంటర్ ఛేంజ్‌లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు ప్రత్యేకంగా ట్రంపెట్ నిర్మిస్తున్నారు. దీనివల్ల ఎయిర్‌పోర్టు వైపు నుంచి అవుటర్ మీదుగా నేరుగా నియోపొలిస్ లేఅవుట్‌లోకి రావచ్చు. దీనికి రూ.82 కోట్లను వ్యయం చేస్తున్నారు. దీంతో ఈ నియోపోలిస్‌కు పెద్దఎత్తున డిమాండ్ ఏర్పడింది.
అందరి దృష్టి అటువైపే!
గతంలో కోకాపేట చుట్టుపక్కల వేలం వేసినప్పుడు ఎకరా రూ.40 కోట్ల ధర పలికింది. ఈసారి దీనికి మించి రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్య ధరపలికే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రెండు మూడు అంతర్జాతీయ సంస్థలు వేలంలో పాల్గొంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నియోపొలిస్ వెంచర్ ఏర్పాట్లన్నింటిని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. వెంచర్ లోపల వంద అడుగుల రోడ్లను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఖానామెట్‌లోని 15.01 ఎకరాలను రేపు వేలం వేయడానికి టీఎస్‌ఐఐసీ ఏర్పాట్లు చేసింది. ఈ వెంచర్‌కు గోల్డెన్ మైల్ అని పేరు పెట్టారు. ఈ భూములకు కూడా భారీ ధర దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇదీ చూడండి:
Sajjala OSD: సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీ.. ప్రభుత్వం ఉత్తర్వులు