హోం మంత్రి ఛైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భద్రత కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోంశాఖ కార్యదర్శితోపాటు ప్రజాజీవితంలో నిపుణత, విశేష అనుభవమున్న అయిదుగురు వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. వీరిని ప్రభుత్వం నామినేట్ చేస్తోంది. సభ్యుల పదవీ కాలం రెండేళ్లు ఉంటుంది. ఐజీ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి కలిగిన అధికారి ఈ కమిషన్‌కు కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
కమిషన్ నిర్వర్తించాల్సిన బాధ్యతలు...
కనీసం ఆరు నెలలకు ఒక్కసారైనా కమిషన్ సమావేశమవ్వాలి. ప్రతి ఏడాది పోలీసుల పనితీరుపై ప్రభుత్వానికి నివేదించాలి. ఈ వార్షిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ ముందు ఉంచుతుంది. సామర్థ్యం, జవాబుదారీతనంతో కూడిన పోలీసింగ్‌ను పెంపొందించేందుకు అవసరమైన మార్గదర్శకాలను సూచించాలి. నేరాలను విశ్లేషించి నియంత్రణ చర్యలను సిఫార్సులు చేయాలి. అయిదేళ్ల వ్యవధికి వ్యూహాత్మక ప్రణాళికను, పోలీసు అధికారుల శిక్షణ విధానాన్ని రూపొందించాలి.
రాష్ట్రస్థాయి పోలీసు ఫిర్యాదుల అథారిటీ
పోలీసు సంస్కరణల్లో భాగంగా ఏర్పాటైన రాష్ట్రస్థాయి పోలీసు ఫిర్యాదుల అథారిటీకి ఛైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి/ముఖ్య కార్యదర్శి, అంతకంటే పైహోదాలో పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి వ్యవహరిస్తారని ప్రభుత్వం పేర్కొంది. జిల్లాస్థాయి పోలీసుల ఫిర్యాదుల అథారిటీ ఛైర్మన్‌గా జిల్లా విశ్రాంత జడ్జి/కార్యదర్శి, అంతకంటే పైహోదాలో పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి వ్యవహరిస్తారంది.
ఇదీ చదవండి: