రాష్ట్రంలో ఎండలు ఏటికేడు ముదురుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. 2018-20 మధ్య పరిశీలిస్తే.. కోస్తా జిల్లాల్లో 3.7 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమలోనూ 1.2 డిగ్రీలు పెరిగింది. ఇప్పుడు రోజువారీ చూసినా సాధారణం కంటే.. 9.4 డిగ్రీల వరకు అధికంగా ఉంటున్నాయి. ఉదయం 8 గంటలకే 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. భానుడి భగభగలకు తోడు తీవ్ర వడగాల్పులు ప్రజల్ని వణికిస్తున్నాయి. రాత్రి ఏడు గంటలు దాటినా ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు తగ్గకపోవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. గతేడాది మార్చి చివరి వారంతో పోలిస్తే.. ఇప్పుడు ఎండల ప్రభావం బాగా పెరిగింది. బాపట్లలో 5.5 డిగ్రీలు, ఒంగోలులో 5.2, అమరావతి, నెల్లూరుల్లో 4.3, విజయవాడలో 4.1, తిరుపతి 3.3, జంగమహేశ్వరపురం 3.2 డిగ్రీల మేర పెరిగింది. 2020లో మే నెలాఖరుకు పలు మండలాల్లో 43 డిగ్రీల నుంచి 47.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చి 31నే గరిష్ఠ ఉష్ణోగ్రత 45.9 డిగ్రీలకు చేరడం, వందకు పైగా మండలాల్లో ఎండల ప్రభావం బాగా కన్పించడం గమనార్హం. దీంతో మే నెలకు పరిస్థితి ఇంకెంత తీవ్రంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అ‘సాధారణం’గా పెరిగిపోతున్నాయి..
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. మార్చి 31న గుంటూరు జిల్లా బాపట్లలో సాధారణ ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలు నమోదు కావాల్సి ఉంటే 40.5 (7.3 డిగ్రీలు అధికంగా) వచ్చింది. ఏప్రిల్ 2న 9.4 డిగ్రీలు పెరిగింది. తునిలో 6.5 డిగ్రీలు అధికంగా నమోదయింది. విజయవాడలో ఆరు డిగ్రీలు పెరిగి, గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఒంగోలులోనూ 6 డిగ్రీలు పెరిగింది. నెల్లూరు, విశాఖపట్నం, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు పెరిగాయి.
సాధారణం కంటే పెరగొచ్చు..
మే వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 8 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. గాలుల దిశను బట్టి ఉష్ణోగ్రతలు మారుతుంటాయి. ప్రాంతాల వారీగా పరిస్థితుల్లోనూ మార్పు కనిపిస్తుంది.
- స్టెల్లా, సంచాలకులు, అమరావతి వాతావరణ కేంద్రం
ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం...
ఎండల తీవ్రతపై ఫిబ్రవరిలోనే శాఖాధిపతులు, జిల్లా అధికారుల్ని అప్రమత్తం చేశాం. చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీకి సిద్ధంగా ఉండాలని సూచించాం. మండలాల వారీగా ఉష్ణోగ్రతలను గమనిస్తూ.. 42 డిగ్రీలకు చేరడంతోనే తహసీల్దార్లకు సమాచారం పంపిస్తున్నాం. వడగాల్పుల తీవ్రతపై సచివాలయ సిబ్బందికీ నేరుగా సందేశాలు పంపే ఏర్పాట్లు చేశాం.
- కె.కన్నబాబు, కమిషనర్, విపత్తుల నిర్వహణ సంస్థ
సుర్రుమనే ఎండలో సుడిగాలి...
ఏప్రిల్ మాసానికే భానుడు భగభగమంటూ ఠారెత్తిస్తున్నాడు. శనివారం చిత్తూరు పట్టణంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. కలెక్టరేట్ ఎదురుగా ఉన్న చెన్నై-బెంగళూరు హైవేపై సాయంత్రం నాలుగు గంటల సమయంలో దాదాపు రెండు నిమిషాల పాటు వీచిన సుడిగాలిని ప్రజలు ఆసక్తిగా చూశారు.
ఇదీ చదవండి