మన దేశంలో అందిస్తున్నంత న్యాయసేవ ప్రపంచంలో మరెక్కడా లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. న్యాయసేవ కోసం ఏటా సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. మార్చిలోపు జాతీయస్థాయి న్యాయసేవ సదస్సు హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు జస్టిస్ రమణ తెలిపారు.
న్యాయవాదులు నిర్వహించిన తెలంగాణ హైకోర్టు ఆవిర్భావ దినోత్సవంలో జస్టిస్ రమణ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, ఇతర న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నర్సింహారెడ్డి పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తుల ఖాళీలు, కేసుల పెండెన్సీ ఆందోళనకరంగా ఉందని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
తెలంగాణలో 24 జడ్జిలకు గాను 13 మందే ఉన్నారని... ఏపీలో 30 మందికి 15 మంది న్యాయమూర్తులు ఉన్నారని.. సుమారు 2 లక్షల 70వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్న జస్టిస్ రమణ.. హైకోర్టుల్లో మొత్తం 1100 జడ్జిలకు గాను 600 మందే ఉన్నారని చెప్పారు. గొప్ప సంస్కృతి, సదుపాయాలు ఉన్న హైదరాబాద్ వైపు దేశమంతా చూస్తోందని... ఇక్కడ మరిన్ని న్యాయ సంస్థలు ఏర్పాటయ్యేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు.
తనకు తెలుగు అంటే విపరీతమైన అభిమానమని పేర్కొన్న జస్టిస్ రమణ... 'తెలుగు బిడ్డవై ఉండి.. అన్య భాష నేర్చి ఆంధ్రమ్ము రాదని సకిలించు ఆంధ్రుడా' అన్న కాళోజీ మాటలను సభలో ప్రస్తావించారు.
ఇవీ చూడండి: