పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆగస్టు 23కి వాయిదా వేసింది. ప్రస్తుత కరోనా తీవ్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సుమారు 90 వరకు వాజ్యాలు హైకోర్టులో దాఖలయ్యాయి.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జోయ్ మల్య బాగ్చీ, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు ఈ వాజ్యాలు వచ్చాయి. ఈ వాజ్యాలపై విచారణను ఏ విధంగా తీసుకోవాలి? ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయవాదులు భౌతికంగా హైకోర్టుకు వచ్చేందుకు ఎంతవరకు అవకాశాలున్నాయి? సుప్రీంకోర్టు న్యాయవాదులు కొందరు రైతుల తరఫున వాదనలు వినిపిస్తున్నందున...వారి దిల్లీలో లాక్‌డౌన్ దృష్ట్యా తాము ఇప్పుడు హైకోర్టు వరకు రాలేమనే విషయాన్ని లేఖ ద్వారా హైకోర్టు ముందుకు తీసుకొచ్చారు.
ఆన్‌లైన్‌లోనే ఎంతసేపు ఈ కేసులను విచారణ జరపాలి వంటి అంశాలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని మొదట హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం భావించింది. కానీ ప్రస్తుత కరోనా తీవ్ర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని... విచారణ వాయిదా వేసింది. కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున విచారణను వాయిదా వేయాలని కొందరు పిటిషనర్ల తరఫు దిల్లీకి చెందిన న్యాయవాదులు ఇప్పటికే హైకోర్టుకు రాసిన లేఖను ధర్మాసనం పరిశీలించింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై ఈ ఏడాది మార్చి 26న మొదటిసారి విచారణ జరిపి మే 3కు వాయిదా వేసింది. ఇప్పుడు ఈ విచారణ ఆగస్టు 23కి వాయిదా పడింది.
ఇదీ చదవండి : హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ముగ్గురు కరోనా రోగులు మృతి.. ఆక్సిజన్ అందకే అంటున్న బంధువులు