రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ఈనెల 20న జరగాల్సిన సీట్లు కేటాయింపును హైకోర్టు నిలుపుదల చేసింది. వెబ్ ఐచ్చికాల ద్వారా కళాశాలల ఎంపిక ప్రక్రియ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 21 కి వాయిదా వేసింది. జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి , జస్టిస్ ఆర్.రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది .
ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 70 శాతం కన్వీనర్ కోటా, 30 శాతం యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఉద్దేశించిన .. జీవో 55ను సవాలు చేస్తూ రాయలసీమ డిగ్రీ కాలేజ్ అసోసియేషన్...హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. యాజమాన్య కోటాకు కేటాయించిన 30 శాతం సీట్లను కన్వీనరే భర్తీ చేస్తారనడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఇది ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల హక్కుల్లో జోక్యం చేసుకోవడేమేనని తెలిపారు. విద్యా సంస్థలన్నింటిని ఏకరూపం తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని...విద్యాశాఖ తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు..ఈనెల 20 న జరగాల్సిన సీట్ల కేటాయింపు ప్రక్రియపై స్టే విధించింది.
ఇదీ చదవండి: ప్రైవేటు డిగ్రీ, పీజీ కోర్సుల్లో యాజమాన్య కోటా నిర్ణయం.. ఫీజు ఎంతంటే?