డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్ ప్రవేశాలు ప్రక్రియ కొనసాగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు వెసులుబాటు ఇచ్చింది. ఈ వ్యాజ్యంలో కోర్టు తుది తీర్పునకు లోబడి పిటిషనర్ల ప్రవేశాలు ఉంటాయని స్పష్టంచేసింది. వ్యాజ్యంలో లోతైన విచారణ అవసరం అని పేర్కొంది. కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏపీ ఉన్నత విద్యా మండలిని ఆదేశించింది. విచారణను అక్టోబర్ 25 కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావు ఈ మేరకు ఆదేశాలిచ్చారు . కొవిడ్ కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులందరికి మార్కులు కేటాయించిన నేపథ్యంలో, డిగ్రీలో ఆన్ లైన్ ప్రవేశాలు నిర్వహించడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ విద్యార్థిని కీర్తన మరొకరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
విద్యా శాఖ తరపు ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ వాదనలు వినిపిస్తూ, పదిలో వచ్చిన మార్కుల ఆధారంగా 30 శాతం, ఇంటర్ మొదటి సంవత్సరంలో వచ్చిన మార్కుల ఆధారంగా 70 శాతం రెండో ఏడాది విద్యార్థులకు వెయిటేజ్ మార్కులిచ్చామన్నారు. గతేడాది డిగ్రీ కళాశాలల్లో ఆన్ లైన్లో ప్రవేశాలు జరిగాయన్నారు. కౌంటర్ వేయడానికి సమయం కోరారు. అందుకు న్యాయమూర్తి అంగీకరించారు.
ఇదీ చదవండి: