High Court: రేషన్ బియ్యం పేరుతో రైసు మిల్లర్లను, వాహనదారులను పోలీసులు వేధించటంపై కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన సౌదామిని రైస్ మిల్లు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. 'ఎసెన్షియల్ కమోడిటీస్' చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని న్యాయవాది రవితేజ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలు పాటించకుండా రైస్ మిల్లులోని ఐదు వాహనాలను సీజు చేశారని తెలిపారు. జిల్లా అధికారులకు తెలియచేసినా ఎటువంటి ఫలితం లేదన్నారు. కేసు నమోదు చేశారు కానీ... నిబంధనల ప్రకారం కలెక్టర్కు నివేదించలేదన్నారు. అక్కడ అక్రమంగా బియ్యం తరలింపు జరుగుతుందని పోలీసు తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
అక్రమాలు జరిగితే చట్ట, నిబంధనలు ప్రకారం నడుచుకోవాలని, ఆ విధంగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని గతంలో అనేక పర్యాయాలు హైకోర్టు.. డీజీపీకి ఆదేశాలు ఇచ్చిందని పిటిషనర్ న్యాయవాది రవితేజ గుర్తు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణకు డీజీపీ హాజరుకావాలని ఆదేశించింది. అనేకసార్లు న్యాయస్థానాలు ఆదేశాలు ఇచ్చినా అధికారులు ఎందుకు పాటించడం లేదో వివరించాలని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: