ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో సీట్లు కుదించేందుకు వీలుగా విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. గతంలోనే ఈ జీవో అమలును నిలిపివేసిన న్యాయస్థానం... ఇప్పుడు కొట్టివేస్తూ ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై వాదనలు వినిపించిన పిటిషనర్ల తరఫు న్యాయవాదులు.... గతంలో సెక్షన్‌కు 88మంది చొప్పున 9 సెక్షన్లకు గరిష్టంగా 792 మంది విద్యార్థుల్ని చేర్చుకునే అవకాశం ఉండేదని నివేదించారు. ప్రభుత్వ జీవోతో సెక్షన్‌కు 40 మంది చొప్పున మొత్తం 360 మందికి మాత్రమే అవకాశం ఉందన్నారు. లోపాల పేరిట అన్ని కాలేజీలను సాధారణీకరిస్తూ సీట్లు కుదించడం సరికాదన్నారు. కరోనా కారణంగా పరీక్షలు లేకుండా పదో తరగతి విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులుగా ప్రకటించినందున... కళాశాలల్లో సీట్లు పెంచాలే తప్ప తగ్గించరాదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.... జీవో 23ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
విధివిధానాలు రూపొందించండి...
ఇంటర్ సీట్ల భర్తీకి ఆన్‌లైన్ ప్రవేశాల ప్రక్రియపైనా హైకోర్టులో వాదనలు జరిగాయి. వచ్చే విద్యాసంవత్సరం ఆన్‌లైన్ ప్రవేశాలు జరపాలనుకుంటే... విధివిధానాలు రూపొందించిన తర్వాతే ప్రక్రియ చేపట్టాలని ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రెస్ నోట్ ఇచ్చేసి ఆన్‌లైన్ ప్రవేశాలు చేపడతామంటే కుదరదని స్పష్టంచేసింది. కొత్త విధానాన్ని అనుసరించే ముందు మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్దేశించింది. ఆన్‌లైన్ ప్రవేశాల సందర్భంగా విద్యార్థులకు సమస్య ఎదురైతే పరిష్కరించడానికి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఆక్షేపించింది. డిగ్రీ ప్రవేశాల తరహాలో ఇంటర్ మార్గదర్శకాలపై ప్రభుత్వం జీవో ఇవ్వలేదన్నారు. ఇక డిగ్రీ కోర్సులకు ఆన్‌లైన్ ప్రవేశాలు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన మరో వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది.