High Court on court complex building News: విజయవాడలోని బహుళ అంతస్తుల కోర్టు భవన సముదాయాన్ని ఈ ఏడాది జూన్ 30లోగా పూర్తిచేసి... అప్పగిస్తామని రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి హైకోర్టుకు నివేదించారు. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేశారు. మరోవైపు ప్రభుత్వ న్యాయవాది(జీపీ) నర్సిరెడ్డి వాదనలు వినిపిస్తూ భవన నిర్మాణ గుత్తేదారుకు చెల్లించాల్సిన రూ.5కోట్ల బకాయిలను ఈనెల 15లోగా జమ చేస్తామన్నారు. ఆ హామీని ధర్మాసనం నమోదు చేసింది. భవన నిర్మాణ పురోగతి, గుత్తేదారుకు చెల్లింపు వివరాలు, ఎనిమిదో అంతస్తుకు ఆర్థికశాఖ ఆమోదం తదితర విషయాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ కె.మన్మథరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. విజయవాడలోని కోర్టు భవన సముదాయం నిర్మాణంలో జాప్యాన్ని సవాలు చేస్తూ న్యాయవాది చేకూరి శ్రీపతిరావు హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గంటా రామారావు వాదనలు వినిపించారు. బకాయిల చెల్లించడంలో ఆలస్యం కారణంగానే పనుల్లో జాప్యం జరుగుతున్నట్లు గుత్తేదారు సంస్థ చెబుతోందన్నారు. ఎనిమిదో అంతస్తుకు పూర్తిస్థాయి అనుమతులు ఇంకా రాలేదన్నారు. గుత్తేదారు తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు సైతం వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం నుంచి రూ.5 కోట్ల బిల్లు రావాల్సి ఉందన్నారు. ఎనిమిదో అంతస్తు విషయంలో మరో రూ.5కోట్ల పనులు చేశామన్నారు. ఎనిమిదో అంతస్తుకు ఆర్థికశాఖ నుంచి ఆమోదం రాలేదన్నారు. అయినా పనులను చేపట్టామన్నారు. 2017తో పోలిస్తే ప్రస్తుతం నిర్మాణ ఖర్చులు బాగా పెరిగాయన్నారు.
మిగతా కాంట్రాక్టర్ల విషయంలో పరిస్థితులకు తగ్గట్టు నిర్మాణాలకు చెల్లింపుల ధరను పెంచుతున్న ప్రభుత్వం... న్యాయశాఖకు చెందిన భవనాల విషయంలో పెంచడం లేదన్నారు. న్యాయమూర్తుల కమిటీ నిర్ణయం మేరకు కోర్టు భవనాల విషయంలో ధరల పెంపు క్లాజ్‌ను తొలగించామని ప్రభుత్వం చెబుతోందన్నారు. అందుకు ఆధారాలేవి చూపడం లేదన్నారు. కోర్టు భవనాల నిర్మాణం వ్యవహారంలో ధరల పెంపు క్లాజ్‌ను అమలు చేయకపోవడంతో గుత్తేదారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. నిర్మాణ సమయాన్ని పొడిగించాలని గుత్తేదారు కోరిన కారణాలు సహేతుకంగా ఉన్నాయని ప్రభుత్వమే అంగీకరించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ కోర్టు భవన నిర్మాణ వ్యయాన్ని పెంచి, గుత్తేదారుకు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
ఇదీ చదవండి: 'పునరుత్పాదక ఇంధన సంస్థలకు అత్యధిక బకాయిలున్న రాష్ట్రం ఏపీ'