రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ విధించడంపై రైతులు, మహిళలు హైకోర్టులో వేసిన పిటిషన్లపై విచారణ జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి సుమోటోగా తీసుకున్న పిటిషన్‌తో కలిపి అన్నింటిపై విచారణ జరిపారు. మహిళలపై దురుసుగా ప్రవర్తించిన అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరగా.... అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉందని, అదనపు ప్రమాణ పత్రం దాఖలు చేసేందుకు సమయం కావాలని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానాన్ని కోరారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
అలాగే సీఆర్డీఏకి రైతుల అభిప్రాయాలు తెలిపేందుకు గడువును పెంచాలని, అప్పటివరకూ హైపవర్ కమిటీ నివేదిక ప్రభుత్వానికి ఇవ్వకుండా ఉండాలని హైకోర్టులో వేసిన పిటిషన్‌పైనా విచారణ జరిగింది. రైతులు ఎటువంటి సమస్యలపై అర్జీ పెట్టుకోవాలనే విషయాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని పిటిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.