HC on Rushikonda: కొండలను విచ్చలవిడిగా తవ్వడాన్ని తీవ్రంగా పరిగణిస్తాం అని హైకోర్టు హెచ్చరించింది. విచక్షణారహిత తవ్వకాలను నిలిపేస్తామని తేల్చిచెప్పింది. ప్రకృతి సమతుల్యతకు కొండలు చాలా అవసరం అని, చెట్లను నరికితే మళ్లీ పెంచగలం కాని కొండలను పెంచలేమని పేర్కొంది. కొండలకు అండగా నిలిచే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేలా తగిన ఆదేశాలిస్తామని పేర్కొంది.
రుషికొండ తవ్వకంపై దాఖలైన వ్యాజ్యాల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జడ్)నిబంధనలకు విరుద్ధంగా రుషికొండపై విచక్షణారహితంగా తవ్వకాలు, చెట్ల కొట్టివేతను సవాలు చేస్తూ జనసేన కార్పొరేటర్ పీవీఎల్‌ఎన్ మూర్తియాదవ్, ఇదే అంశంపై విశాఖ తూర్పు నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ వ్యాజ్యాలు హైకోర్టులో విచారణకు వచ్చాయి.
ఇవీ చూడండి: