HC ON AMAR RAJA PETITION : అమర్‌రాజా బ్యాటరీస్ పరిశ్రమలోని ఉద్యోగుల రక్తంలో సీనం శాతాన్ని తేల్చేందుకు నిర్వహించిన వైద్య పరీక్ష నివేదికను కోర్టు ముందు ఉంచకపోవడంతో ఏపీ కాలుష్య నియంత్రణ మండలిపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఇలాగైతే కేసు పూర్వాపరాల ఆధారంగా తగిన ఉత్తర్వులిస్తామని స్పష్టంచేసింది. గతంలోనూ నివేదిక ఇస్తామని కోర్టుకు తెలిపారని గుర్తుచేసింది. పీసీబీ తీరు వైఖరి సరిగా లేదని వ్యాఖ్యానించింది. అఫిడవిట్‌తో పాటు నివేదికను కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేస్తూ విచారణను ఫిబ్రవరి 3 కు వాయిదా వేసింది. పరిశ్రమ మూసివేతకు పీసీబీ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాల్ని మరోసారి పొడిగించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా , జస్టిస్ బీఎస్ భానుమతితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
అంతకు ముందు పీసీబీ తరఫు న్యాయవాది సురేంద్రరెడ్డి స్పందిస్తూ.. రక్తనమూనా నివేదికలు తనకు అందలేదన్నారు. కేవలం కౌంటర్ మాత్రమే సిద్ధమైందన్నారు. త్వరలో కోర్టుకు అందజేస్తామన్నారు. కొవిడ్ కారణంగా పర్యవేక్షణ సాధ్యం కాలేదన్నారు. గత కొన్నేళ్లుగా అమరాజా పరిశ్రమలో తనిఖీలు లేవన్నారు. అమర్ రాజా పరిశ్రమ తరఫు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. వైద్య పరీక్ష నివేదికలు అందినా కోర్టు ముందు ఉంచడం లేదన్నారు. ప్రతిపక్షనేతకు చెందిన పరిశ్రమ కావునా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తప్ప.. ప్రపంచంలో ఏ సంస్థ ద్వారా తనిఖీలు నిర్వహించినా అంత సవ్యంగానే ఉంటాయన్నారు. వైద్య నివేదికను కోర్టు ముందు ఉంచడంలో విఫలమైందన్నారు.
ఇదీ చదవండి