Bail to Kuppam TDP leaders: కుప్పం తెదేపా నేతలకు హైకోర్టులో ఉరట లభించింది. మాజీ ఎమ్మెల్సీ జి. శ్రీనివాసులు, మాజీ జడ్పీటీసీ ఎస్. రాజ్ కుమార్, మునిస్వామిలతో పాటు మరో ఐదుగురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 25వేల రూపాయల బాండ్, ఇద్దరు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా జరిగిన ఘర్షణలో తెదేపా నేతలపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కొందరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చిత్తూరు జైలులో తెదేపా నేతలు ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోరుతూ మాజీ ఎమ్మెల్సీ, మాజీ జడ్పీటీసీలతో పాటు మరికొందరు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారించిన ధర్మాసనం.. బెయిల్ మంజూరు చేసింది.
అసలేం జరిగింది: తెలుగుదేశం అధినేత చంద్రబాబు మొదటి రోజు కుప్పం పర్యటనలో చోటుచేసుకున్న ఘటనలపై ఆ పార్టీ నాయకుల మీద కేసులు నమోదయ్యాయి. రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో తెదేపా నాయకులు 26 మందిపై హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. రామకుప్పం మండలం కొల్లుపల్లిలో వైకాపా జెండాలు, తోరణాల వివాదంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరగ్గా. కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.
ఈ సమయంలో రాళ్ళబుదుగూరు ఎస్సై మునిస్వామితో పాటు తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు. ఎస్సై మునిస్వామి ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులుతో పాటు మరో ఆరుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రామకుప్పం మండలం వెంకటాపురానికి చెందిన వైకాపా నేత గణేష్ ఫిర్యాదుతో మాజీ జడ్పీటీసీ సభ్యుడు రాజకుమార్ తో సహా 8 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రామకుప్పం మండలం రాజుపేటకు చెందిన ఎ.ధనరాజ్ ఫిర్యాదు మేరకు తెదేపా నేత నరసింహులు సహా 11 మంది పై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: