పోలీసులు అరెస్టు చేసినవారికి రిమాండ్ వేసే ముందు అర్నేస్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను మెజిస్ట్రేట్లు పాటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. రిమాండ్ విధించే సమయంలో వ్యక్తుల స్వేచ్ఛకు సంబంధించిన అంశమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది. సుప్రీం మార్గదర్శకాలను అనుసరించకపోవడం ఏపీలోనే కాకుండా ప్రతిచోటా జరుగుతోందని వ్యాఖ్యానించింది. నిబంధనలు పాటించని మెజిస్ట్రీట్లపై శాఖాపర విచారణకు ఆదేశించిన సందర్భాలున్నాయని ధర్మాసనం గుర్తుచేసింది.
పోలీసులు, సీఐడీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రతులను 24 గంటల్లో వెబ్‌సైట్లో పొందుపరచడం లేదంటూ ఓ వార్తా ఛానెల్ అధిపతి దాఖలు చేసిన వ్యాజ్యంపై ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ప్రాథమిక విచారణ చేయకుండా సీఐడీ పోలీసులు నేరుగా కేసులు నమోదు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఎఫ్ఐఆర్ ప్రతులను 24 గంటల్లో అధికారిక వెబ్ సైట్స్, పోలీసు సేవ యాప్‌లో పొందుపరచడం లేదని నివేదించారు. వివిధ రాష్ట్రాల్లో పోలీసుల తీరు ఇలాగే ఉందని ధర్మాసనం బదులిచ్చింది. రాష్ట్రంలో మెజిస్ట్రేట్లు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించేలా ఉత్తర్వులు జారీచేస్తామంటూ తీర్పు వాయిదా వేసింది.
ఇదీచదవండి.