ఏపీపీఎస్సీ ఈనెల 14 నుంచి షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్న గ్రూప్ -1 ప్రధాన పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరీక్షను నిలుపుదల చేయాలన్న అప్పీళ్లను కొట్టేసింది. ప్రశ్నలు, జవాబుల ప్రామాణికతను నిర్ణయించాల్సింది నిపుణులే కాని న్యాయస్థానాలు కాదని పేర్కొంది. జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, జస్టిస్ డి.రమేశ్‌లతో కూడిన ధర్మాసనం ఈమేరకు తీర్పునిచ్చింది.
2018 డిసెంబర్లో 169 గ్రూప్-1 పోస్టుల భర్తీ నిమిత్తం ఏపీపీఎస్సీ ప్రకటన జారీచేసింది. ప్రాథమిక పరీక్ష 2019 మే 28న నిర్వహించి.. ఫలితాలు వెల్లడించింది. గత నవంబర్ 2 నుంచి ప్రధాన పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ దశలో ప్రాథమిక పరీక్ష మొత్తం 120 ప్రశ్నలలో ఆంగ్ల ప్రశ్నలను తెలుగులోకి అనువాదం సందర్భంగా 51 తప్పులు దొర్లాయని.... ఈ నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని కొంత మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి ప్రాథమిక పరీక్షలో దొర్లిన తప్పులను సరిదిద్దుకునేందుకు వీలు కల్పిస్తూ... నవంబర్ 2న జరగాల్సిన ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీని ఆదేశించారు. ఐదు ప్రశ్నల విషయంలో జవాబులను పునఃపరిశీలించి వాటి ఆధారంగా కొత్త జాబితాను తయారు చేయాలని స్పష్టం చేశారు. తాజాగా అర్హత సాధించిన వారిని ప్రధాన పరీక్ష రాయడానికి అనుమతించాలని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఈనెల 14 నుంచి ప్రధాన పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ... కొంతమంది అభ్యర్థులు ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. తర్జుమాలో ఉన్న తప్పులను మాత్రమే సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకున్నారని... ప్రశ్నలు తప్పుగా ఉన్న విషయాన్ని పరిగణించలేదని విన్నవించారు. నిపుణుల కమిటీని నియమించి...ఈ నెల 14న జరగనున్న ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని కోరారు. అయితే వారి అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది.
ఇదీ చదవండి:
వింత వ్యాధి: 'ఆరోగ్య శ్రీ' లోకి చేర్చుతూ ప్రభుత్వ ఉత్తర్వులు