రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ) నియామకం, పదవీకాలం విషయమై పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, తదనంతర జీవోలపై దాఖలైన వ్యాజ్యాల్లో శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో ధర్మాసనం తీర్పును వాయిదా(రిజర్వు) వేసింది. రాతపూర్వక వాదనలు సమర్పించేందుకు వెసులుబాటు ఇచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది.
తనను తొలగించాలన్న దురుద్దేశంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చారని, దానిని రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్, జీవోలను రద్దు చేయాలని మరో 12 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. శుక్రవారం జరిగిన విచారణలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు కొనసాగిస్తూ.. ఆర్డినెన్స్‌పై రమేశ్‌కుమార్ కోర్టును ఆశ్రయించాక మిగిలిన పిటిషనర్లు వేసిన వ్యాజ్యాలకు విచారణార్హత లేదన్నారు.
ఆర్డినెన్స్ తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని పునరుద్ఘాటించారు. కొత్త ఎస్‌ఈసీ జస్టిస్ వి.కనగరాజ్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ చట్ట నిబంధనలకు లోబడి ఉందన్నారు. ఇంప్లీడ్ పిటిషనర్ల తరఫున న్యాయవాదులు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ వాదనలు వినిపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి రాతపూర్వక వాదనలు సమర్పిస్తామని కోరగా ధర్మాసనం అంగీకరించింది.
నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి, ఇతర పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, ఎ.సత్యప్రసాద్, పి.వీరారెడ్డి ప్రతిసమాధానంగా(రిప్లై) వాదనలు వినిపించారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చే అత్యవసర పరిస్థితులు లేవన్నారు. ప్రభుత్వం తన చర్యను ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. రమేశ్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా తొలగించడం కోసం ఆర్డినెన్స్ తెచ్చారన్నారు. ఆర్డినెన్స్, తదనంతర జీవోలను రద్దు చేయాలని కోరారు. ఇరువైపు న్యాయవాదుల వాదనలు ముగియడంతో హైకోర్టు నిర్ణయాన్ని వాయిదా వేసింది.
ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు