ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో కోస్తాలో ముసురు వాతావరణం నెలకొంది. ఈదురు గాలులతోపాటు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో రాష్ట్రంలోనే అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం గరికిపాలెంలో 122.5 మి.మీ, విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో 110.5 మి.మీల వర్షపాతం నమోదైంది. శనివారం ఉత్తర, దక్షిణ కోస్తాలోని తూర్పుగోదావరి, యానాం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని సూచించింది. రాయలసీమలోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది.
- శుక్రవారం ఉదయం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో 60 మి.మీ నుంచి 95 మి.మీ వరకు వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, పల్నాడు, వైయస్‌ఆర్, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిశాయి.
- గురువారం ఉదయం 8.30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల మధ్య అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 110 మి.మీ, విజయనగరం జిల్లా బొబ్బిలిలో 99.25, పార్వతీపురంలో 70 మి.మీ వర్షం కురిసింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
పెరుగుతున్న గోదావరి వరద
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం వద్ద గోదావరిలో వరద పెరుగుతోంది. గురువారం రాత్రి వరకు ఉద్ధృతంగా పెరిగిన వరద శుక్రవారం మధ్యాహ్నానికి నిలకడగా మారింది. సాయంత్రం నుంచి మళ్లీ పెరగడంతో పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. పోశమ్మగండి వద్ద గండిపోశమ్మ అమ్మవారి ఆలయంలోకి భారీగా నీరు చేరడంతో దర్శనాలను నిలిపివేశారు. చినరమణయ్యపేట- దండంగి మధ్య సీతపల్లి వాగుపైకి వరద నీరు చేరడంతో దేవీపట్నం వైపునకు రాకపోకలు నిలిచాయి. తొయ్యేరు- దేవీపట్నం గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ రహదారిపైకి వరద చేరుతోంది.
- గోదావరికి వరద నీరు పోటెత్తింది. గతంలో జులై నెలాఖరు, ఆగస్టు రెండో వారం నాటికి నదిలోకి వరద నీరు వచ్చి చేరేది. ఈ సారి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఒక్కసారిగా నీటిమట్టం పెరిగింది. శుక్రవారం రాత్రికి నీటిమట్టం 8.7 అడుగులు ఉండగా లక్ష క్యూసెక్కులకుపైగా నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. గత నాలుగైదేళ్లలో ఇదే సమయానికి 50 వేల క్యూసెక్కుల లోపు నీటినే సముద్రంలోకి విడిచిపెట్టినట్లు అధికారులు చెబుతున్నారు.
ఆలమట్టికి వరద జోరు
మహారాష్ట్ర దక్షిణ ప్రాంతంలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ఉపనదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పంచగంగా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నట్లు మహారాష్ట్ర అధికారులు తెలిపారు. ఈ నది నుంచి కృష్ణా నదికి 71,293 క్యూసెక్కుల నీరు వస్తోంది. రాజాపూర్ బ్యారేజ్ నుంచి 5,633 వేల క్యూసెక్కులు, దూద్‌గంగ నుంచి 14,960 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. ఆలమట్టి జలాశయానికి శుక్రవారం ఉదయానికి 75,207 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఆలమట్టి జలాశయంలో ప్రస్తుతం 52 శాతం నిల్వలున్నాయి. దిగువన ఉన్న నారాయణపుర జలాశయం 84 శాతం నిండింది. ఎగువన ఏమాత్రం నీరు విడుదలైనా నారాయణపుర నుంచి దిగువన జూరాలకు నీరు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు శుక్రవారం సాయంత్రం ప్రకటించారు.
ఇదీ చూడండి: Doli : డోలీ దాటని గిరిజనం బతుకులు.. గర్భిణి అవస్థలు!