Heavy rains telangana: మేఘాలకు చిల్లు పడిందా అన్నట్లు తెలంగాణలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనంత కుంభవృష్టి పడుతోంది. గురువారం కూడా అతిభారీగా, శుక్రవారం భారీగా వానలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. శనివారం నాటికి కొంతమేర తగ్గే అవకాశాలున్నాయని అంచనా. మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకూ అత్యధిక వర్షపాతం(24 గంటల్లో) కుమురంభీం జిల్లా జైనూర్‌లో 39.1 సెంటీమీటర్లు నమోదైంది.
ఈ గ్రామంలో రాత్రి 8.30 గంటల వరకూ 36 గంటల పాటు నిరంతరాయంగా వర్షం కురుస్తూనే ఉన్నందున ఏకంగా 49.6 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లా గుండిలో 42.2, నిర్మల్ జిల్లా పెంబిలో 39.1 సెం.మీ.లు పడింది. రాష్ట్రంలో 74 ప్రాంతాల్లో 10 నుంచి 39.9 సెం.మీ.ల వరకూ కుండపోత వర్షాలు కురిశాయి. 1983 అక్టోబరు 6న 24 గంటల్లో నిజామాబాద్‌లో కురిసిన 35.5 సెంటీమీటర్లే ఇప్పటివరకు రికార్డు. తెలంగాణపై రుతుపవనాల గాలులు వేగంగా కదులుతుండటంతో పలు ప్రాంతాల్లో కుంభవృష్టి పడుతోంది. గోదావరి నదీ ఎగువ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున ఈ నదికి వరద మరింత పెరిగే సూచనలున్నాయి.
ఇవీ చదవండి: