Heavy Rain in Hyderabad: హైదరాబాద్లోని పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నగరంలోని జీడిమెట్ల, షాపూర్ నగర్, సూరారం, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, గచ్చిబౌలి, చంపాపేట్, కర్మన్ఘాట్, సరూర్నగర్, సైదాబాద్, అంబర్పేట్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. భారీగా ఈదురుగాలులు వీయడంతో నాంపల్లిలోని ఆర్డీవో కార్యాలయ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం నుంచి ఇనుప రేకులు ఎగిరి పడి అటుగా వెళ్తున్న వాహనాలపై పడ్డాయి. దీంతో నాంపల్లి ప్రధాన రోడ్డు కూడలిలో 3 కార్లు ధ్వంసం కాగా.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.
రెండు రోజులు వర్షాలు: తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రం మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు వ్యాపించాయని వాతావరణ కేంద్రం వివరించింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ. ఎత్త వరకు స్థిరంగా కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇవీ చూడండి: