2020 డిసెంబరు 20 నుంచి 2021 జనవరి 15 మధ్య విద్యుత్ కొనుగోళ్లను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సమీక్షించింది. పీపీఏలు కుదుర్చుకున్న సంస్థల నుంచి తక్కువ ధరకు అందుబాటులో ఉన్న విద్యుత్‌ను వదిలి.. రోజూ అధిక ధరకు బహిరంగ మార్కెట్‌లో కొన్నట్లు గుర్తించింది. దీనివల్ల 48.14 కోట్లు నష్టపోయినట్లు తేల్చింది. గతేడాది డిసెంబరు 22న రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 161.4 మిలియన్ యూనిట్లుగా ఉంది.
ఇందులో 44.71 మిలియన్ యూనిట్లు (ఎంయూ)ను డిస్కంలు.... విద్యుత్ ఎక్సేంజ్‌ల నుంచి యూనిట్‌కు సగటున 3.339 రూపాయలకు కొన్నాయి. పీపీఏ కుదుర్చుకున్న ఉత్పత్తి సంస్థల నుంచి అదే రోజున 109.94 ఎంయూలు అందుబాటులో ఉన్నా... 68.89 మాత్రమే తీసుకున్నాయి. వాటి సగటు యూనిట్ ధర 3.022 రూపాయలు. తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ఎంయూలను వదిలిపెట్టి బహిరంగ మార్కెట్‌లో కొనడం వల్ల... విద్యుత్ రంగానికి 1.38 కోట్లు నష్టం వాటిల్లినట్టు ఏపీఈఆర్‌సీ పేర్కొంది.
బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరకు కొనుగోలు
ఏపీఈఆర్‌సీ సమీక్షించిన ఈ నెల రోజుల్లో... రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 4వేల 875 ఎంయూలు ఉండగా.. పీపీఏలు కుదుర్చుకున్న ఉత్పత్తి సంస్థల వద్ద 2వేల 523 ఎంయూలను డిస్కంలు తీసుకున్నాయి. మరో 1036 తక్కువ ధరకు అందుబాటులో ఉన్నా కాదని.. 894 ఎంయూలను బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరకు కొన్నట్టు గుర్తించింది. ఈ నెల రోజుల్లో ప్రతిరోజూ ఇలానే జరిగినట్టు తేల్చింది. బ్రేక్‌డౌన్, బొగ్గు కొరత వల్ల కొన్ని సంస్థలు సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయలేదని డిస్కంలు పేర్కొన్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ కొనుగోలుకు అనుమతించాలని ఏపీఈఆర్సీని కోరాయి.
విద్యుత్ ఎక్సేంజ్‌లు, ఇంట్రా డే మెకానిజమ్ ద్వారా సమీకరణకు అనుమతిచ్చిన ఏపీఈఆర్‌సీ.. ఇలా కొనే విద్యుత్ పీపీఏలు కుదుర్చుకున్న సంస్థల నుంచి తీసుకునే యూనిట్ వ్యయాన్ని మించరాదని షరతు విధించింది. తక్కువ చర వ్యయం ఉన్న ఉత్పత్తి సంస్థల నుంచి పూర్తిస్థాయి విద్యుత్ అందుబాటులో లేక బహిరంగ విపణిలో కొన్నట్లు డిస్కంలు పేర్కొన్నాయి. ఆయా సంస్థలు సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయకపోవటానికి కారణాలతో నివేదిక పంపాలని ఏపీఈఆర్‌సీ ఆదేశించింది.
ఇదీ చదవండి: