రాజధాని అమరావతిలో అసైన్డ్ రైతుల వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. జీవో నంబర్ 316పై తదనంతర చర్యలు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. రిటర్నబుల్ ప్లాట్లు వెనక్కి తీసుకుంటామంటూ గతంలో జారీ అయిన GO నంబర్ 316పై ఈ విధంగా ఆదేశించింది. అసైన్డ్ రైతులకు భూములను అనుభవించే హక్కు ఉందే తప్ప.. విక్రయించే అధికారం లేదంటూ జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అమరావతి కోసం భూ సమీకరణలో.. అసైన్డ్ రైతులు తమ భూములను ఇవ్వడం నిబంధనలకు వ్యతిరేకమని.. వెంటనే ఆయా భూములను వెనక్కి ఇచ్చేయాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై అసైన్డ్ రైతులు.. హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వం.. 29 గ్రామాల రైతుల నుంచి భూములు తీసుకుందని.. చుట్టూ వందల ఎకరాలు సమీకరించాక.. అప్పటి ప్రభుత్వంతో చర్చించామని.. మెరుగైన ప్యాకేజీ ఇస్తూ జీవో నంబర్ 41 జారీ చేశారని రైతులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ జీవో చెల్లదంటూ 316 నంబర్ జీవో తీసుకురావడమే కాక నోటీసులివ్వడంపై ఆవేదన వెలిబుచ్చారు. రైతుల వ్యాజ్యాలపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. జీవో నంబర్ 316పై తదుపరి చర్యలు చేపట్టొద్దని ఆదేశించింది.
ఇదీ చదవండీ.. 'అడుగుకో గుంత.. గజానికో గొయ్యి.. ఇదీ వైకాపా పాలనలో రహదారుల దుస్థితి'