రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ-వాచ్ యాప్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. యాప్ రూపొందించడంలో ఎస్ఈసీ సాంఘిక సంక్షేమశాఖ రూపొందించిన సోర్స్‌ను ఉపయోగించినట్లు గమనించామని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. వారి అనుమతి తీసుకున్నారో లేదో తెలుసుకోవాల్సి ఉందన్నారు. మొత్తం 24 అంశాలపై అభ్యంతరాలకు సమాధానం ఇవ్వాలని లేఖ రాశామన్నారు. సమాధానం వచ్చాక యాప్ సర్టిఫికేషన్‌పై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిఘా యాప్ పని చేయడం లేదని ఎన్నికల కమిషన్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీ-విజిల్ యాప్‌ను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ యాప్ లేదా సి-విజిల్ యాప్ ఉపయోగించుకుంటే... అభ్యంతరం ఉందా..? అని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. తమకేమీ అభ్యంతరం లేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. కేసు తదుపరి విచారణ ఈనెల 17కి వాయిదా వేసింది.
పెద్దిరెడ్డి అప్పీల్‌పై నేడు విచారణ
పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు మీడియాతో మాట్లాడకుండా నిలువరిస్తూ... రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను సింగిల్ జడ్జి సమర్థించడాన్ని సవాలు చేస్తూ... పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టు ధర్మాసనంలో అప్పీల్ వేశారు. ఏకగ్రీవ ఫలితాల నిలిపివేత సరికాదని, నిబంధనల ప్రకారం వ్యవహరించాలని మాత్రమే ఆర్వోలను మంత్రి కోరినట్టు కోర్టుకు తెలిపారు. ఎన్నికల కమిషన్ ప్రతిష్ఠను మంత్రి దిగజార్చలేదని, ఎస్ఈసీయే దిగజారుస్తున్నారని పెద్దిరెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. ఎస్ఈసీ ఉత్తర్వులు అనుసరిస్తే..బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని మంత్రి బెదిరించినట్టు ఎస్ఈసీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు పబ్లిక్ ఆర్డర్‌కు విఘాతం కలిగించేలా ఉన్నాయని....అలా మాట్లాడటం ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోవడమేనన్నారు.
ఎన్నికల ప్రక్రియ, ఎస్ఈసీని తక్కువ చేసి మాట్లాడటం, ప్రతిష్ఠ దిగజార్చడం చేయబోనని మంత్రి కోర్టుకు హామీ ఇస్తే..దాని ప్రకారం ధర్మాసనం తగు ఉత్తర్వులు జారీ చేస్తే అభ్యంతరం లేదని ఎస్ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. స్పందించిన మంత్రి తరఫు న్యాయవాది....ఎన్నికల ప్రక్రియ, ఎస్ఈసీపై వ్యక్తిగత ఆరోపణలు చేయబోరని కోర్టుకు హామీ ఇస్తున్నామన్నారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు... నిర్ణయాన్ని వెల్లడించేందుకు విచారణను నేటికి వాయిదా వేసింది
ఇదీ చదవండీ... 'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైకాపా వ్యతిరేకిస్తోంది'