Health Precautions in Summer: ఈసారి వేసవి సెలవుల్లో అంటూ ఏవేవో ప్రణాళికలు వేసుకునే ఉంటారు. తీరా ఈ ఎండలు చూసి బేజారైపోతున్నారా.! నిజమే, చాలామంది ఏడాదంతా వేచి చూసే సమయమూ ఇదే... ఆ సమయం వచ్చాక ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనుకునేదీ వేసవి గురించే. సెలవులు, ఊరి ప్రయాణాలు, లేలేత ముంజెలు, తీయని మామిడిపండ్లు ఎంత ఆనందం కలిగిస్తాయో.. మండే ఎండా చెమటా ఉక్కపోతా కరెంటు కోతా అంత విసుగూ కలిగిస్తాయి.
అందుకే ఈ కాలంలో ఎవరిని పలకరించినా ఎండల్లో తిరగొద్దంటూ ఒకటే సలహా ఇస్తారు. కానీ ఉద్యోగ వ్యాపారాలకు, వేర్వేరు పనులకు బయట తిరక్క తప్పదు కాబట్టి తిరిగే సమయాన్ని మార్చుకోవడమే మన చేతుల్లో ఉన్న పని. వీలైనంతవరకూ పొద్దున్న పదకొండు లోపల, సాయంత్రం నాలుగు తర్వాత మాత్రమే బయట పనులు చక్కబెట్టుకోవాలి. ఇంకా ఈ కాలం బయటకు వెళ్లేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలూ వెంట ఉంచుకోవాల్సిన వస్తువులూ కొన్నున్నాయి. అవేంటంటే...
* లేత రంగుల్లో మెత్తటి వదులైన నూలు దుస్తులు ధరించడం ఒంటికీ కంటికీ కూడా హాయి.
* సాధ్యమైనంతవరకూ శరీరానికి ఎండ తగలకుండా చూసుకోవాలి. తలకి టోపీ లేదా స్కార్ఫ్ తప్పనిసరి. కాస్త నడవాల్సిన పని ఉంటే బరువనుకోకుండా గొడుగు తీసుకెళ్లాలి.
* ఎండ ప్రభావం చర్మం మీద చాలా ఎక్కువ. చెమట కారుతోందని చికాకు పడతాం కానీ అది మన శరీర ఉష్ణోగ్రతని సాధారణంగా ఉంచేందుకు జరిగే సహజ రక్షణ ప్రక్రియ. ఎంత ఎక్కువ వేడిగా ఉంటే అంత ఎక్కువ చెమట పడుతుంది. రెండుపూటలా స్నానం చేయడమే దానికి పరిష్కారం. చర్మం శుభ్రమై చెమట పొక్కులు రాకుండా ఉంటాయి. బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి.
* ఎండాకాలంలో సూర్యకిరణాల తీవ్రతా వాటిల్లోని అతినీలలోహిత కిరణాలూ కళ్లకు హానిచేస్తాయి. అందుకే ఎండలో సరిగా చూడలేం. బలవంతంగా చూడాలని ప్రయత్నిస్తే కళ్లు బైర్లు కమ్మి తాత్కాలిక అంధత్వం వచ్చే ప్రమాదం పొంచివుంటుంది. చలువ కళ్లద్దాలు ఆ ప్రమాదాన్ని నివారిస్తాయి. అయితే మామూలు కళ్లద్దాల్లాగా కాకుండా కళ్లను పూర్తిగా కవర్ చేసే చలువ అద్దాలను ఎంచుకోవాలి.
* ఎక్కడికి వెళ్తున్నా వెంట నీళ్ల సీసా తీసుకెళ్లాలి. ఇప్పుడే వచ్చేస్తాంగా అని నిర్లక్ష్యం చేస్తే దాహమైనప్పుడు ఇబ్బందిపడాల్సి వస్తుంది.
* ఏసీ ఉన్న ఆఫీసుల్లో, కారు ప్రయాణాల్లో ఎక్కువ సమయం గడిపేవారికి చల్లదనం వల్ల దాహం తెలియదు. అలాంటి వాళ్లు మర్చిపోకుండా గంటకోసారి గ్లాసు నీళ్లు తాగుతూ ఉంటే డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు.
* పనిమీద బయటకు వెళ్లినప్పుడో, సమావేశాలకు హాజరైనప్పుడో సమయం మన చేతుల్లో ఉండదు. అలాంటప్పుడు తక్షణ శక్తినిచ్చే ఖర్జూరాలు, ఎండుద్రాక్ష లాంటివి వెంట ఉంచుకుని మధ్య మధ్యలో నోట్లో వేసుకుంటే ఆకలీ దాహమూ రెండూ తీరతాయి.
* అసలు ‘సమ్మర్‌కిట్’ ఒకటి సిద్ధంగా ఉంచుకుంటే ఇంకా మంచిది. దాంట్లో పైన చెప్పుకున్న వాటన్నిటితోపాటు మెత్తని టవలూ, ఓఆర్‌ఎస్/గ్లూకోజ్ పాకెట్లు కూడా పెట్టాలి. అలా అన్నీ ఒక బ్యాగులో ఉంచుకుంటే బయటకు వెళ్లాల్సివచ్చినప్పుడు ఏవీ మర్చిపోయే ప్రసక్తి ఉండదు.
ఆహారం... మితంగా!
వేసవిలో ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన అంశం ఆహారం. ఫ్రిజ్‌లో నిలవ పెట్టుకోకుండా ఏరోజుకారోజు తాజాగా వండుకోవాలి.
* ఎండ వేడి వల్ల త్వరగా నీరసం వచ్చేస్తుంది కాబట్టి ఉదయం అల్పాహారం ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు.
* మసాలా వంటలకూ, ఎక్కువ నూనెతో చేసే వేపుడు కూరలకూ, పచ్చళ్లకూ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎండ వేడికీ కొవ్వు పదార్థాలకీ అస్సలు పడదు. దాంతో అజీర్తి సమస్యలు తలెత్తుతాయి.
* ఈ కాలంలో దొరికే సొర, దోస లాంటి నీటిశాతం ఎక్కువుండే కూరగాయలనూ, అన్నిరకాల ఆకుకూరలనూ తినాలి. పచ్చిపులుసు, మజ్జిగచారు లాంటి పలుచటి పదార్థాలను ఎక్కువగా చేసుకోవాలి.
* భోజనం పరిమాణం తగ్గించుకోవాలి. కడుపునిండా తిని నీళ్లు తాగితే వాంతులవుతాయి.
* చిరుతిళ్ల కింద పకోడీలూ మిర్చీబజ్జీలు లాంటి నూనె పదార్థాలు మానేసి తేలిగ్గా అరిగే పండ్లకు ప్రాధాన్యమివ్వాలి.
పానీయం... పరమౌషధం
వాతావరణంలో వేడి వల్లా, చెమటల రూపంలోనూ ఈ కాలంలో శరీరంలో నీరు త్వరగా ఆవిరైపోతుంది. నీటితోపాటే శరీరంలోని లవణాలూ పోతాయి. దాంతో లోపలి కణజాలమూ కండరాలూ సరిగా పనిచేయలేక ఇబ్బందిపడతాయి. కండరాలు పట్టేయడం, కాళ్లూ చేతులూ కొంకర్లు పోవడం అందుకే. శరీరం కోల్పోతున్నవాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. కూల్‌డ్రింకులూ ఫ్రిజ్‌లోని చల్లటినీళ్లూ తాగుతుంటే ఆ క్షణానికి ఎంతో హాయిగా ఉంటుంది కానీ వాటిల్లో శరీరానికి కావలసినవన్నీ అందవు. అందుకని చెమటలు ఎక్కువగా పట్టేవాళ్లు లవణాలతో కూడిన పానీయాలు తాగాలి. ఈ మూడు నెలలూ టీ, కాఫీలు మానేసి ఇంటిల్లిపాదీ ఉప్పు, నిమ్మరసం వేసిన చల్లని మజ్జిగ తాగే అలవాటు చేసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేసినవాళ్లవుతారు. తాజా పండ్లరసాలు, నిమ్మకాయ షర్బత్, నన్నారి, కొబ్బరినీళ్లు, చెరుకురసం, మామిడిరసం, జల్‌జీరా, లస్సీ లాంటివన్నీ రోజుకో రకం చొప్పున చేసుకుని రుచి చూడటానికి ఇదే సరైన సమయం. వాటివల్ల వేడి నుంచి ఉపశమనమూ లభిస్తుంది, జీర్ణవ్యవస్థకి హితంగానూ ఉంటుంది. పిల్లలు కూడా కూల్‌డ్రింకుల జోలికి వెళ్లకుండా ఉంటారు. కీరాదోస లేదా రకరకాల పండ్ల ముక్కల్నీ, పుదీనా, తులసి లాంటి ఆకుల్నీ నీళ్లలో నానబెట్టి చేసుకునే ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ కూడా వేసవి దాహం తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎవరికి ఇష్టమైన ఫ్లేవర్ నీళ్లను వాళ్లు రోజంతా ఆస్వాదించవచ్చు. ఆయా పండ్లలోని సుగుణాలన్నీ నీటిలో చేరడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లూ ఖనిజాలూ కూడా అందుతాయి. వేసవిలో కొందరికి పాదాలూ మడమలూ కాళ్లూ, చేతులూ లాంటివి ఉబ్బుతుంటాయి. ఇది ఎండల వేడికి అలవాటుపడటానికి శరీరం చేసే ప్రయత్నమే. కిడ్నీ, కాలేయ సమస్యల్లాంటివి లేనివాళ్లు ఆ వాపు గురించి ఆలోచించకుండా పాదాల కింద దిండుపెట్టుకుని పడుకుంటే తగ్గిపోతుంది. ఎక్కువ సమయం కదలకుండా కూర్చోవడమూ నిలబడడమూ ఎవరికీ మంచిది కాదు.
పెద్దల సంరక్షణ పెద్ద బాధ్యత!
పిల్లల్లాగే పెద్దల్నీ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన సమయమిది. ఆరోగ్యంగా, వయసులో ఉన్నవారినే వేసవి తాపం ఆపసోపాలు పడేలా చేస్తుంది. ఇక వృద్ధాప్య సమస్యలతో బాధపడే పెద్దలు దాన్ని తట్టుకోవాలంటే వారి సంరక్షణపై కుటుంబసభ్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందే. వ్యాయామం మాననివ్వకూడదు. ఉదయం ఏడులోపలే నడక కార్యక్రమం ముగించేలా చూసి బార్లీ, ఓట్స్, రాగి లాంటి వాటితో జావ చేసివ్వడం మంచిది. సబ్జా గింజలు నానబెట్టిన నీళ్లూ సగ్గుబియ్యం జావా కూడా వారికి శక్తినిస్తాయి. ఆ తర్వాత కాసేపటికి తేలిగ్గా జీర్ణమయ్యే అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో కూర, చారులతో సమతులాహారం, సాయంత్రం పండ్ల రసం... ఇలా మూడు గంటలకోసారి ఏదో ఒకటి ఇస్తూ వాళ్లు నీరసించిపోకుండా చూసుకోవాలి. వాళ్లు పడుకునే గది చల్లగా ఉండేలా చూడాలి. కూలర్ అయినా ఏసీ అయినా పడకకు మరీ దగ్గరగా ఉంటే ఆ గాలికి గొంతెండిపోతుంది. నిద్ర పోయినప్పుడు కాకుండా మిగిలిన సమయాల్లో తరచూ ఎవరో ఒకరు పలకరిస్తూ ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్లు ఒంటరిగా ఉంటున్నట్లయితే ఫోనులో అయినా పలకరిస్తూండాలి. షుగరూ బీపీ లాంటి సమస్యలున్నవారిని క్రమం తప్పకుండా డాక్టరుకి చూపించాలి. సాయంత్రం పూర్తిగా చల్లబడ్డాక దగ్గర్లో పార్కు ఉంటే అందులోనూ లేకపోతే రద్దీగా లేని వీధిలో అయినా కాసేపు బయట తిరిగేలా చూడాలి. చదువుకునే అలవాటున్న వారికోసం కొత్త పుస్తకాలు కొనివ్వాలి.
పిల్లలు పైలం..!
వేసవి సెలవులంటేనే పిల్లలకు ఆటవిడుపు. అయితే సాయంత్రం పూర్తిగా చల్లబడ్డాక మాత్రమే ఆరుబయట ఆడుకోనివ్వాలి. కాకపోతే, పగలంతా వారికి బోర్ కొట్టకుండా కొన్ని ఏర్పాట్లు చేయాలి...
* తోచడం లేదంటూ రోజంతా టీవీకో ఫోన్లకో అతుక్కుపోకుండా మంచి కాలక్షేపం అయ్యేందుకు వాళ్ల వయసుకి తగిన బోర్డుగేమ్స్, డ్రాయింగ్ పుస్తకాలు తెచ్చిపెట్టాలి.
* వాళ్లకి ఇష్టమైన హాబీ ఏదైనా ప్రాక్టీసు చేసేలా చూడాలి. కాస్త పెద్ద పిల్లల్ని ఆన్‌లైన్ కోర్సుల్లో చేర్పించొచ్చు. కొత్త భాష నేర్పించవచ్చు. హోంవర్కులూ పరీక్షల ఒత్తిడి ఉండదు కాబట్టి ఇష్టంగా కొత్తపనుల్లో నిమగ్నమవుతారు.
* కథల పుస్తకాలు ఇచ్చి చదువుకోమని వదిలేయకుండా చదివిన కథ గురించి వాళ్లలో వాళ్లను చర్చించుకోమనాలి. ఏ పాత్ర ఎందుకు నచ్చిందో, కథ ద్వారా ఏం తెలుసుకున్నారో వాళ్ల మాటల్లో రాయమంటే చిట్టి బుర్రలకు పదును పెట్టినట్లు అవుతుంది. వాళ్లు రాసింది చదివి ప్రశంసించి, తగిన సూచనలు ఇస్తూ ఉంటే ఇంకా ఉత్సాహంగా చదువుతారు. మంచి పుస్తకాలు చదివే అభిరుచి పిల్లల్లో నాటుకునేలా చేయడానికి వేసవి సెలవులే సరైన సమయం.
* సెలవుల్లో వారి దినచర్య గురించి డైరీ రాయమని చెప్పొచ్చు. దానివల్ల ఆలోచనలను అక్షరాల్లో పెట్టడం అలవడుతుంది. రాసుకోవడం కోసమైనా ఒక మంచి పనిచేయాలని ఆలోచిస్తారు.
* రోజూ కొన్ని కొత్త పదాలు నేర్చుకోవడం, పజిల్స్ చేయడం లాంటివీ నేర్పవచ్చు. ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వాళ్లకి ఒక అరగంట పుస్తకం చదివి వినిపించే బాధ్యతని పిల్లలకు అప్పజెప్పాలి. దానివల్ల పిల్లలకూ పెద్దలకూ మధ్య అనుబంధం బలపడడమే కాదు, పెద్దల దగ్గర కొత్త విషయాలు తెలుసుకుంటారు.
* పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే హడావుడిలో ఉన్న పెద్ద పిల్లల మీదా ఒక కన్నేసి ఉంచాలి. ఒక పక్కన మండే ఎండలూ మరో పక్కన పరీక్షల ఒత్తిడీ వారిని తిండికీ నిద్రకీ దూరం చేస్తాయి.
* వేసవిలో ప్యాకేజ్‌డ్, రెడీమేడ్ తినుబండారాల అమ్మకాలూ ఎక్కువేనట. ఉప్పూ చక్కెరా లాంటివి ఎక్కువగా ఉండే ఆ పదార్థాల జోలికి పిల్లలు వెళ్లకుండా ఉండాలంటే వాటిని తలదన్నే రుచికరమైన, ఆరోగ్యకరమైన చిరుతిళ్లు ఇంట్లో తయారుచేసినవి అందుబాటులో ఉంచాలి.
ప్రయాణాల్లో పదిలంగా...
పిల్లల చదువుకి ఇబ్బంది అవుతుందని ఏడాదంతా ఎటూ వెళ్లకుండా ఉండేవాళ్లకి వేసవి సెలవులే కాస్త వెసులుబాటు. పిల్లలు తాతయ్య- బామ్మల ఇంటికి వెళ్లాలన్నా; పెద్దలు ఏ పెళ్లి వంకనో బయల్దేరి బంధువులందరినీ కలుసుకోవాలన్నా తగిన సమయం ఇదే కాబట్టి ప్రయాణాలు తప్పవు. అలా ఊరెళ్లినప్పుడు గుర్తుంచుకోవాల్సినవి...
* ఎంత ఏసీలో ఉన్నా పెళ్లిళ్లూ ఫంక్షన్లకు హాజరైనప్పుడు త్వరగా అలసిపోతారు. తగిన విశ్రాంతీ వేళకి సరైన ఆహారమూ తప్పనిసరి.
* కుటుంబమంతా కలిసి ఎటైనా టూర్ వెళ్లాలనుకున్నప్పుడు వాతావరణం ఆహ్లాదంగా ఉండే ప్రాంతాలను ఎంచుకోవాలి. బయల్దేరినప్పటినుంచీ తిరిగి ఇంటికి చేరేవరకూ అన్ని ఏర్పాట్లూ పక్కా ప్రణాళికతో చూసుకుంటే మధ్యలో ఇబ్బందులు ఉండవు.
* పర్యటక స్థలాల్లో ఆరుబయట సెల్‌ఫోన్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారిగా వాతావరణం మారితే- వడగళ్ల వాన ముంచుకురావచ్చు, పిడుగులు పడవచ్చు. అలాంటి సమయంలో సెల్‌ఫోన్ వాడకూడదు. నీటి కొలను సమీపంలోనూ, చెట్ల కిందా నిలబడకుండా ఏదైనా భవనం లోపలికి చేరుకోవాలి.
* ఎండాకాలంలో నీటిని చూడగానే పిల్లలు కేరింతలు కొడతారు. ఊళ్లలో ఉండే కుంటలూ చెరువులూ రిజర్వాయర్లూ వాళ్లని ఆకట్టుకుంటాయి. నలుగురు కలిశారంటే ముందూ వెనకా ఆలోచించకుండా దూకేస్తారు. కానీ ఈత రాకుండా నీటిలో దిగడం ఎంత ప్రమాదకరమో వారికి చెప్పాలి. వెసులుబాటు ఉన్నవాళ్లు దగ్గరుండి పిల్లలకు ఈత నేర్పిస్తే మరీ మంచిది.
అప్రమత్తత అవసరం
ఆరోగ్యపరంగానే కాదు, వేసవిలో మరికొన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి.
* వేసవి సెలవుల్లోనే ఇళ్లల్లో దొంగలు పడి దోచుకునే సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. ఇళ్లకు తాళాలు వేసి ఊరెళ్లడమే దానికి కారణం. అలాంటప్పుడు పొరుగువారికో దగ్గరలో ఉన్న బంధుమిత్రులకో ఇంటిమీద ఓ కన్ను వేసి ఉంచమని చెప్పాలి. పోలీసు స్టేషనుకు సమాచారం ఇవ్వడమూ మంచిదే. కొన్నిచోట్ల పోలీసులు అందుకోసం ప్రత్యేకమైన ఆప్‌లను వినియోగిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుని ఉపయోగించుకోవచ్చు. ఊరెళ్తున్నామోచ్... అంటూ సోషల్ మీడియాలో టముకు వేయడం కోరి ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమేననీ గుర్తుంచుకోవాలి. అంతగా రాసుకోవాలనుకుంటే వెళ్లొచ్చాక రాసుకోవచ్చు.
* ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల అగ్నిప్రమాదాలూ జరుగుతుంటాయి. దానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
* విద్యుత్ ఉపకరణాలను వినియోగించేటప్పుడు వైర్లన్నీ సరిగా ఉన్నదీ లేనిదీ గమనిస్తుండాలి. వేడికి కొన్ని కరిగిపోతుంటాయి. కరెంటు పోయినప్పుడు అన్ని స్విచ్‌లూ ఆపేయడం, వాడని పరికరాలకు ప్లగ్‌లు తీసేసి ఉంచడం మంచి పద్ధతి. చాలామంది టీవీ, ఏసీలాంటి వాటిని రిమోట్‌తో ఆపుతారు. ఇరవై నాలుగ్గంటలూ స్విచ్ ఆన్‌లోనే ఉంటుంది. అది మంచిది కాదు. స్విచ్ ఆఫ్ చేయాలి.
* ఈ కాలంలో మొబైల్ ఫోన్ కూడా త్వరగా వేడెక్కిపోతుంటుంది. దాన్ని అలాగే వాడడం, చార్జింగ్ పెట్టి వాడడం... చాలా ప్రమాదకరం.
* వాహనాల్లో పెట్రోలు పోయించుకోవాలంటే- ఉదయం ఎండెక్కక ముందు, సాయంత్రం చల్లబడిన తర్వాత... తగిన సమయాలు.
వడదెబ్బ తగిలితే...
ఎండలోకి వెళ్తేనే వడదెబ్బ తగులుతుందనుకుంటారు. నిజానికి ఎండలోకి వెళ్లకపోయినా వడదెబ్బ తగలొచ్చు. వివిధ కారణాల వల్ల సమయానికి దాహం తీర్చుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. పిల్లలకీ, వృద్ధులకీ కొన్ని రకాల మందులు వాడేవారికీ... దాహమవుతున్న సంగతి తెలియదు.
అలాంటప్పుడు చెమట వల్ల ఒంట్లో నీరంతా ఆవిరైపోయి చర్మం పొడిబారి శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. నీటితో పాటే రక్తం పరిమాణం కూడా తగ్గటం వల్ల రక్తపోటు పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత 107 డిగ్రీలు దాటితే లోపలి అవయవాలన్నీ దెబ్బతినడం మొదలెడతాయి. దాంతో మాటల్లో తికమక పడటం, తలనొప్పి, వాంతులు, మూర్ఛ లాంటి సమస్యలు వస్తాయి. స్పృహ తప్పుతుంది. కోమాలోకి వెళ్లిపోవచ్చు. వేగంగా జరిగే ఈ మార్పుల వల్ల సంభవించే ప్రాణాపాయ పరిస్థితినుంచి రక్షించాలంటే ప్రవర్తనలో కాస్త తేడా కనిపించిన తక్షణమే శరీరాన్ని చల్లబరచాలి. దుస్తులు వదులు చేసి, చల్లని నీటిలో తడిపిన బట్టతోకానీ ఐసు ముక్కలను బట్టలో వేసికానీ ఒంటిని తుడవాలి. ఫ్యాన్ గాలి తగిలేలా చూడాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూనే ఆస్పత్రికి చేర్చాలి. అంతేకానీ ఆ పరిస్థితిలో సొంతంగా జ్వరం ట్యాబ్లెట్ కూడా వేయకూడదు.
నిశ్శబ్దంగా ముంచుకొచ్చే ముప్పు ఈ వడదెబ్బ. ఎక్కడికక్కడ తగు జాగ్రత్తలతో దానికి చెక్ పెట్టగలిగే శక్తి మన చేతిలో ఉన్నప్పుడు ఆందోళన ఎందుకు... ఎండాకాలాన్నీ హాయిగా ఎంజాయ్ చేసేయక..!
ఇవీ చదవండి: 100 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునేలా వ్యాక్సిన్